తమిళనాడుకు కావేరి నీటి విడుదల.. నేడు కర్ణాటక బంద్‌

29 Sep, 2023 10:38 IST|Sakshi

శివాజీనగర: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కన్నడ ఒక్కూట అఖండ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారమే బెంగళూరు బంద్‌ దాదాపు జయప్రదమైంది. రాష్ట్ర బంద్‌ సందర్భంగా వాహన సంచారం, అంగళ్లు, హోటల్‌, సినిమా థియేటర్లు, మాల్స్‌, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నీ బంద్‌ అయ్యే అవకాశముంది. ఒక్కూట వాటాళ్‌ నాగరాజ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా బంద్‌ జరుగుతుందన్నారు.

బెంగళూరుతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నా, ర్యాలీలు జరుపుతామని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ శెట్టి తెలిపారు. హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల సంఘాలు సంఘీభావం తెలిపాయి. వాహనాలు ఉండకపోవడం వల్ల స్కూళ్లు కూడా మూతపడవచ్చు. ఆర్టీసీ రవాణా బస్సుల సంచారం కూడా తక్కువగా ఉండవచ్చు. రాష్ట్రమంతటా అన్ని సినిమా థియేటర్లు బంద్‌ కానున్నాయి. అనేకమంది నటీనటులు మద్దతు తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు చేయాలని సంఘాలు నిర్ణయించాయి.

బంద్‌ చట్టవిరుద్ధం: నగర సీపీ
కర్ణాటక బంద్‌ నేపథ్యంలో బెంగళూరులో గట్టి పోలీస్‌ బందోబస్తు కల్పించినట్లు పోలీస్‌ కమిషనర్‌ బీ దయానంద్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఎక్కడా ధర్నా, ర్యాలీ, ఊరేగింపులకు అవకాశం లేదు. గురువారం రాత్రి నుండే 144 సెక్షన్‌ జారీలోకి వచ్చింది. బంద్‌ అనేవారికి నోటీసులు ఇస్తాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం బంద్‌కు పిలుపునివ్వడం చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్‌ శాఖ పనిచేస్తుందని చెప్పారు. బంద్‌ సమయంలో ప్రభుత్వ ఆస్తిపాస్తులకు నష్టం కలిగిస్తే పిలుపునిచ్చినవారే బాధ్యులవుతారన్నారు. నగరవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు.

యథావిధిగా ఆర్టీసీ, సిటీ బస్సులు
క్రవారం కర్ణాటక బంద్‌ అయినప్పటికీ కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సులను యథావిధిగా నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉద్యోగులు మామూలుగానే డ్యూటీలకు రావాలని ప్రకటించారు. ఎవరూ కూడా బంద్‌లో పాల్గొనరాదని, విధులకు రాకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాపులు, బీఎంటీసీ డిపోలకు పోలీస్‌ భద్రత కల్పిస్తారు.

మరిన్ని వార్తలు