బస్సులు ఫుల్‌, చార్జీలు డబుల్‌..

22 Oct, 2023 09:48 IST|Sakshi
శనివారం రాత్రి బెంగళూరు మెజస్టిక్‌ బస్టాండులో ప్రయాణికుల కోలాహలం

కర్ణాటక: రాష్ట్రంలో ఆర్టీసీ కోసం కొత్తగా 5,675 కొత్త బస్సులు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బడ్జెట్‌లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించాం, కొనుగోలు ప్రక్రియనే త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శక్తి వల్ల

బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరిగింది, రద్దీని తట్టుకొనేలా బస్సులను అందుబాటులోకి తేవాలన్నారు. వాహన తనిఖీల ద్వారా రూ.83 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు.

బనశంకరి: దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు స్వంత ఊర్ల బాటపట్టగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు టికెట్‌ బుకింగ్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. లగ్జరీ/ ఏసీ బస్‌ చార్జీలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు మెజస్టిక్‌, మైసూరు రోడ్డు, శాంతినగరలో గల కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండులు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రైవేటు బస్సులు యజమానులు సైతం ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నిర్వహించారు.

సొంతూర్లకు నగరవాసులు
దసరా వల్ల శనివారం నంచి మంగళవారం వరకూ వరుసగా సెలవులు రావడంతో ఐటీ, బీటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. లక్షలాది మంది బస్సులు, క్యాబ్‌లు, సొంత కార్లలో బయల్దేరడంతో నగరంలో ప్రధాన రోడ్లలో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. చాలామంది శుక్రవారం సాయంత్రమే కుటుంబసమేతంగా బయలుదేరి వెళ్లారు. అలాగే మైసూరు రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు, అనేకల్‌ రోడ్లలో ట్రాఫిక్‌రద్దీ ఏర్పడింది. బెంగళూరులో మెజస్టిక్‌, మైసూరు రోడ్డు, శాటిలైట్‌ బస్టాండు, శాంతినగర, జయనగర బస్టాండ్లు కిటకిటలాడాయి. సాధారణ బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట ఏర్పడింది. రైళ్లు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే తిరిగి వచ్చేవారి కోసం అక్టోబరు 24 నుంచి 29 మధ్య ఇతర నగరాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు వేశారు.

టికెట్‌పై రూ. వెయ్యి వరకూ పెంపు
శనివారం ఉదయం నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు చైన్నె, కేరళ, హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయాణాలు మొదలయ్యాయి. టికెట్‌ ధరను రూ.500 నుంచి 1000 పెంచారు. పండుగ సాకుతో బస్సుల యజమానులు దోచేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రైవేటు బస్సుల్లో బెంగళూరు నుంచి కొచ్చికి టికెట్‌ చార్జి రూ.3,500 , హైదరాబాద్‌ –బెంగళూరు, ముంబై–బెంగళూరుకు రూ.3,500గా నిర్ణయించారు. పండుగలకు ఊళ్లకు వెళ్లనివారు కొడగు, చిక్కమగళూరు, ఊటి, మైసూరు, పుదుచ్చేరి తదితర టూర్లకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఒకరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ప్యాకేజీలు ఉన్నట్లు ట్రావెల్‌ఏజెంట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు