పార్టీ పటిష్టానికి శాయశక్తులా కృషి | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టానికి శాయశక్తులా కృషి

Published Wed, Nov 15 2023 12:16 AM

మాట్లాడుతున్న బీవై విజయేంద్ర  
 - Sakshi

కురుడుమలైలో విజయేంద్ర ప్రత్యేక పూజలు

శ్రీనివాసపురం: రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని పటిష్టం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు మంగళవారం ముళబాగిలు తాలూకాలోని సుప్రసిద్ధ కురుడుమలై వినాయక ఆలయంలో వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయేంద్ర బూత్‌ స్థాయి అధ్యక్షులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ చిన్న వయసులోనే తనకు ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటానన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయడానికి కర్ణాటక నుంచి అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో పార్టీ పుంజుకుని 25కు పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పని చేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. తన ఎంపికపై పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదన్నారు. అందరినీ కలుపుకుని పోయి అందరి సహకారంతో పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నద్ధం చేసి గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఈ నెల 17న నిర్వహించే శాసనసభా పక్ష సమావేశంలో కేంద్రం నుంచి వస్తున్న పరిశీలకులు కూడా పాల్గొంటారన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ వేణుగోపాల్‌, ఎంపీ ఎస్‌.మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్‌, బీపీ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement