కొత్త రాజకీయం కావాలి

27 Mar, 2023 00:06 IST|Sakshi
మాట్లాడుతున్న గడల శ్రీనివాసరావు
●రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ●హెల్త్‌ క్యాంపునకు విశేష స్పందన

సుజాతనగర్‌: కొత్తగూడెం నియోజకవర్గం మౌలిక వసతులు, ఇతర అంశాల్లో అభివృద్ధి సాధించాల్సింది ఇంకా ఉందని, నియోజకవర్గానికి కొత్త సూర్యోదయం, కొత్త రాజకీయాలు కావాలని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌, జీఎస్సార్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్టార్‌ హాస్పిటల్స్‌, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సహకారంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గడల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేసే అవకాశం ఏ రూపంలో వచ్చినా స్వీకరిస్తానని తెలిపారు. అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధితో పాటు ఉజ్వల భవిష్యత్‌ అందించడం, కులాలు, మతాలకు అతీతంగా సాటి మనిషి పట్ల మానవత్వం చూపడమే తన జెండా, అజెండా అని పేర్కొన్నారు. కూడు, గూడు, గుడ్డ ప్రతీవారికి అవసరమని అన్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భావించి తనను ఆశీర్వదించాలని కోరారు. కాగా శిబిరానికి 2,316 మంది హాజరుకాగా 60 మంది వైద్యులు, 100 మంది సహాయ సిబ్బంది సేవలందించారు. వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 263 మందిని మెరుగైన వైద్యానికి సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్‌ జాగృతి అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్‌, సర్పంచ్‌ సీకా కృష్ణవేణి, ఎంపీటీసీ పెద్దమల్ల శోభారాణి, ఉప సర్పంచ్‌ లింగం పిచ్చిరెడ్డి, విద్యాకమిటీ చైర్మన్‌ కొమారి కృష్ణ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బోడ హరినాయక్‌, ఆర్‌ఎంపీ వైద్యులు పోటు రాఘవరావు, వెంకట్రావు, సాంబశివరావు, అప్పారావు, కాంగ్రెస్‌ నాయకులు చింతలపూడి రాజశేఖర్‌, ట్రస్ట్‌ మేనేజర్‌ అంజీ, సిబ్బంది మోదుగు జోగారావు, ప్రభాకర్‌, బోడా వినోద్‌, పవన్‌, విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు