బహుజనులకే రాజ్యాధికారం

20 Nov, 2023 00:06 IST|Sakshi

● ఈ ఎన్నికల తర్వాత జరిగేది అదే... ● బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

వైరా: ఈనెల 30న జరిగే ఎన్నికల తర్వాత బహుజనుల చేతికి రాజ్యాధికారం రావడం ఖాయమని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బీఎస్పీ వైరా అభ్యర్థి బానోత్‌ రాంబాబునాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం వైరా రింగ్‌ రోడ్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. మహిళలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసి, ఉద్యోగావకాశాలు కల్పించడమే కాక ఇంటికొక వాషింగ్‌ మిషన్‌ ఉచితంగా అందజేస్తామని తెలి పారు. కాగా, ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు డబ్బులు విరజిమ్మి ఓట్లు లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే, ఆ డబ్బంతా ప్రజల డబ్బే అయినందున తీసుకుని ఓటు మాత్రం బీఎస్‌పీకే వేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. అధికార పార్టీ వెనక ధనబలం ఉంటే తమ వెనక జన బలం ఉన్నందున గెలుపు ఖాయమని ప్రవీణ్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మేకతోటి పుల్లయ్య, నాయకులు ఉదయ్‌, ఉపేందర్‌, బానోత్‌ రజినీబాయి, శరత్‌బాబు, ప్రవీణ్‌కుమార్‌, శ్రీనాథ్‌, నరేష్‌, నిర్మల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు