కాంగ్రెస్‌ గూటికి ‘పాల్వాయి’?

22 Feb, 2024 01:36 IST|Sakshi
సీఎంకు సమస్యలు వివరిస్తున్న హరీశ్‌బాబు

సాక్షి, ఆసిఫాబాద్‌: సిర్పూర్‌ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాత్రం తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌ నుంచే రాజకీయ ప్రస్థానం..
సిర్పూర్‌ నియోజకవర్గంలో హరీశ్‌బాబు గట్టి ప ట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన పాల్వాయి హరీశ్‌బాబు ఆర్థోపిడిక్‌ సర్జన్‌. 2017 నవంబరులో రాజకీయ అరంగ్రేటం చేశారు. బెజ్జూర్‌ మండలం రెబ్బన గ్రామంలో 10 అంశాలతో రాజకీయ ఎజెండాను రూపొందించి ప్రజల్లోకి వచ్చారు. ఏడాది పాటు రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌తో సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పార్లమెంట్‌ ఎన్నికలే ధ్యేయంగా పావులు
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల్ని కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చాక హరీశ్‌బాబు వెంటే కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ రావడం.. ప్రజల్లో కూడా అతనిపై సానుభూతి ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో పాల్వాయికి కలిసొచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఇలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా పార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌బాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం నియోజవర్గంలో తిరుగుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు తదితరాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐదు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కుమురంభీం క్లస్టర్‌ యాత్రను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

‘సిర్పూర్‌ అభివృద్ధి కోసమే కలిశా’
కౌటాల(సిర్పూర్‌): సిర్పూర్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే హరీశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఎమ్మెల్యేను సంప్రదించగా.. ముఖ్యమంత్రి కేవలం పార్టీ ప్రతినిధి కాదని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అని అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పనుల కోసం సీఎంను కలుస్తున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకు తావులేదని స్పష్టం చేశారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు