ప్రపంచ వారసత్వ ప్రకాశం

8 Oct, 2023 11:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాకు జీవ జలాలను అందిస్తున్న ‘ప్రకాశం బ్యారేజీ’కి ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఎంపికై న నాలుగు నిర్మాణాల్లో ఈ బ్యారేజీ ఒకటిగా నిలిచింది. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రెయినేజీ (ఐసీఐడీ) సంస్థ ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజీని గుర్తించింది.

వ్యవసాయ రంగంలో సమర్థవంతంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించడానికి, వాటిపై చేసే పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ అవార్డును ఐసీఐడీ సంస్థ ప్రదానం చేస్తోంది. నవంబర్‌ రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు విశాఖలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌ను నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖకు ప్రదానం చేస్తారు. ఈ మేరకు జలవనరుల శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బ్యారేజీ చరిత్ర ఇదీ..
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి మధ్య కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించాలని 1798లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన కెప్టెన్‌ బకల్‌ ప్రతిపాదించారు. 1832–33లో తీవ్ర వర్షాభావం వల్ల డొక్కల కరువు వచ్చింది. ఆ కరువు ప్రభావంతో కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలో 40 శాతం ప్రజలు ఆకలితో మరణించారు. ఈ కరువు వల్ల ఆ సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి పన్నుల రూపంలో రూ.2.27కోట్ల ఆదాయం తగ్గింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది జీవజలంతో ప్రవహిస్తూనే ఉంది. కృష్ణా జలాలను సాగునీటి అవసరాలకు వాడుకుంటే కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చని కెప్టెన్‌ బెస్ట్‌, లేక్‌ భావించారు. సీతానగరం, ఇంద్రకీలాద్రి మధ్య ఆనకట్ట నిర్మించడం ద్వారా కృష్ణా నదీ జలాలను సాగునీటి అవసరాలకు మళ్లించడం ద్వారా దుర్భిక్షాన్ని ఎదుర్కోవచ్చని 1839–41 మధ్య వారు బ్రిటీష్‌ పాలకులకు నివేదించారు.

కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించాలని సర్‌ ఆర్థర్‌కాటన్‌ ప్రతిపాదించడంతో 1850 జనవరి ఐదో తేదీన ఈస్ట్‌ ఇండియా కంపెనీ బోర్డు ఆమోదించింది. 1852లో ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించి 1855 నాటికి రూ.1.75 కోట్లతో పూర్తి చేసింది. అప్పట్లో ఈ ఆనకట్ట ద్వారా 5.8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేవారు. కృష్ణా నదికి 1952లో వచ్చిన భారీ వరదలకు ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆనకట్ట స్థానంలో 1954 ఫిబ్రవరి 13వ తేదీన బ్యారేజీ నిర్మాణాన్ని అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ బ్యారేజీ నిర్మాణం 1957 డిసెంబర్‌ 24వ తేదీకి పూర్తయింది. 2.97 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజీ కోసం రూ.2.78 కోట్లు ఖర్చుచేశారు. బ్యారేజీ ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు.

నీటిని నిల్వతోపాటు, వాహనాలు ప్రయాణించేలా రోడ్డు మార్గంతో బ్యారేజీని నిర్మించారు. ప్రకాశం పంతులు పేరు వచ్చేలా ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేశారు. అనంతర కాలంలో బ్యారేజీతో పాటు కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం కష్టంగా మారింది. ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టం చేసి, కాలువల వ్యవస్థకు మరమ్మతులు, లైనింగ్‌ పనులు పూర్తిచేసి గాడిలో పెట్టారు. దీంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించిన కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు ప్రకాశం బ్యారేజీ వరప్రదాయినిగా మారింది.

భారీ వరదలను తట్టుకున్న చరిత్ర
కృష్ణా నదికి ఎన్ని సార్లు భారీ వరదలు వచ్చినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడింది. ఈ బ్యారేజీకి 70 గేట్లు ఉన్నాయి. 1903లో ఆనకట్ట ఉన్న సమయంలో కృష్ణా నదికి అత్యధికంగా 11.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. బ్యారేజీ నిర్మించాక 1998లో 9.32 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2009 అక్టోబర్‌లో అత్యధికంగా 11.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా, అంతటి ప్రమాదకర స్థితిని తట్టుకొని బ్యారేజీ నిలబడింది. రాతికట్డడం కావడమే దీనికి కారణం. 2019లో 8.05 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. నీటి విడుదల స్థాయి 12 లక్షల క్యూసెక్కులు ఉండేలా ప్రకాశం బ్యారేజీని డిజైన్‌ చేశారు. ఇలా భారీ వరదలను సైతం తట్టుకొని నిలబడుతూ కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు సాగు జలాలను అందిస్తోంది.

మరిన్ని వార్తలు