భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన

Published Thu, Nov 23 2023 1:42 AM

- - Sakshi

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కార్తిక దీపారాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేసిన లింగ రూపంలోని శివుని బొమ్మలో కార్తిక దీపారాధనలు చేసి మహిళలు భక్తిభావాన్ని చాటుకున్నారు. ఆలయ ఏసీ ఎన్‌ఎస్‌ చక్రధరరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గ్రామీణ వైద్యులకు శిక్షణ పునరుద్ధరించాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ సామాజిక వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్‌ శిక్షణను పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం కర్నూలు పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు పీఎంపీ, ఆర్‌ఎంపీలకు గుర్తింపు ఇచ్చేందుకు కమ్యూనిటీ పారామెడికల్‌ శిక్షణ ప్రారంభించినట్లు వారు తెలిపారు. అది మొదటి, రెండో దశ తర్వాత నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ సంజీవ్‌కుమార్‌ హామీ ఇచ్చినట్లు గ్రామీణవైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఎన్‌ రాజు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో ఆ సంఘం ప్రతినిధులు దస్తగిరి, నాగేశ్వర్‌రెడ్డి, నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

పాండురంగడి ఉత్సవాలు ప్రారంభం

మచిలీపట్నంటౌన్‌: దేశ వ్యాప్తంగా పేరొందిన చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గోపూజ, గణపతిపూజ, విఠల్‌ కోటి పూజ, లక్ష్మీగణపతిహోమం తదితర పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయానికి నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) చేరుకోగా, నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం వారు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను తలపై మోస్తూ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వీరితో పాటు ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం, డెప్యూటీ మేయర్‌ మాడపాటి విజయలక్ష్మి, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ శ్రీకాకోళపు రేణుకారాణి, కార్పొరేటర్లు, స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

యార్డులో 30,591 బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు బుధవారం 30,479 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 30,591 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.24,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.10,000 నుంచి రూ.22,000 వరకు పలికింది.

1/3

2/3

3/3

Advertisement
Advertisement