చోరీల కేసులో నిందితురాలికి జైలు

11 Nov, 2023 01:26 IST|Sakshi

సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి మాయమాటలు చెప్పి మత్తు మందు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న నిందితురాలికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తు 8వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జ్‌ డి.లక్ష్మి శుక్రవారం తీర్పు వెల్లడించారు. విజయవాడ భవానీపురానికి చెందిన సయ్యద్‌ ఆషీరా అలియాస్‌ బూబమ్మ (53) జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడుతుండేది. ఈ క్రమంలో 2016 నవంబర్‌, 7వ తేదీన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తపేటలో ఒక ఇంట్లో సత్యవతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లి తాను బట్టలు కుడతానని, మీ ఇంట్లో ఏవైనా బట్టలు ఉంటే కుట్టిపెడతానంటూ నమ్మకంతో మాటలు కలిపింది. బట్టలు తీసి పెడతాను రేపు వచ్చి కుట్టమని వృద్ధురాలు చెప్పడంతో వెళ్లిపోయి మరుసటి రోజు వృద్ధురాలి ఇంటికి వెళ్లి బట్టలు కుడుతున్నట్లు నటించి ఆమెకు మాయమాటలు చెప్పి బాదం పాలు తానే తయారు చేసి తీసుకొచ్చినట్లు, చాలా బాగుంటుందని నమ్మబలికి ఆమెతో తాగించింది. దీంతో సత్యవతి స్పృహతప్పి పడిపోవడంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు తీసుకుని పారిపోయింది. అనంతరం వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా 2017, పిబ్రవరి, 2వ తేదీ నిందితురాలు బస్టాండ్‌లో ఓ వృద్ధురాలిని మోసగించి బంగారు వస్తువులను దొంగిలించింది. ప్రాసిక్యూషన్‌ తరుపున ఇన్‌ చార్జ్‌ డెప్యూటీ డైరెక్టర్‌, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ జి.కళ్యాణి 15 మంది సాక్షులను విచారించగా నిందితురాలిపై నేరం రుజువు కావటంతో రెండు కేసులకు గాను జైలు శిక్ష విధించారు.

మరిన్ని వార్తలు