జలక్రీడల్లో విజేతలకు సత్కారం

11 Nov, 2023 01:26 IST|Sakshi
విజేతలను సత్కరిస్తున్న ఎమ్మెల్యే సింహాద్రి

అవనిగడ్డ: కయాకింగ్‌ కెనోయింగ్‌ (జలక్రీడల) పోటీల్లో జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గోవాలో జరిగిన జాతీయస్ధాయి కయాకింగ్‌ కెనోయింగ్‌ పోటీలో ద్వితీయస్ధానం సాధించిన నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి, తృతీయస్థానం పొందిన నాగిడి భార్గవి, ఒన్‌ఫ్లస్‌ఒన్‌కు అర్హత సాధించిన నాగిడి అశ్వినిని శాసనసభ్యులు సింహాద్రి శాలువాకప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్‌ని, శిక్షణ పొందేందుకు ఆధునిక లైట్‌ వెయిట్‌ బోట్‌ని అందించేందుకు సహకరించాలని క్రీడాకారిణి గాయత్రి ఎమ్మెల్యే సింహాద్రిని కోరారు. హెవీ వెయిట్‌ బోటు ద్వారా శిక్షణ పొందటం కష్టంగా ఉందన్నారు. విదేశీ లైట్‌ వెయిట్‌ బోటును అందిస్తే మరిన్ని పతకాలు అందుకోగలనని గాయత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌తో మాట్లాడి వాటిని సమకూర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సింహాద్రి చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి దివిసీమకు, మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఏఎంసీ ఛైర్మన్‌ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, నాగాయలంక మండల సచివాలయ కన్వీనర్‌ మద్ది చిన్నా, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావుతో పాటు విజేతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాగాయలంకలో స్కాలర్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు చప్పట్లుతో సాదర స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు