అధిష్టానం పిలుపు.. బోడె స్టంటేనా!

19 Mar, 2024 07:24 IST|Sakshi

బోడేను పిలిచారంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం

పిలవలేదని మరోవర్గం వ్యాఖ్యలు

ఇదెక్కడి గోల అంటూ టీడీపీ శ్రేణుల మండిపాటు

కంకిపాడు: టీడీపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చిందంటూ పెనుమలూరు మాజీఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అనుచరగణం సోషల్‌ మీడియా వేదికగా చేసిన ప్రచారం అంతా పబ్లిసిటీ స్టంటేనని టీడీపీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఈ చర్యలు పార్టీ వర్గాలు, శ్రేణులను గందరగోళానికి, అయోమయానికి గురిచేసేందుకేనని పేర్కొంటున్నాయి. పెనమలూరు సీటు వ్యవహారం తేలాలంటే మరో రెండు రోజులు నిరీక్షించక తప్పదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ అధిష్టానం సీటు కేటాయింపులో తనకు అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ప్రజల్లోకి వెళ్లారు.

స్వతంత్రంగా అయినా పోటీకి సిద్ధమంటూ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో బోడె ప్రసాద్‌ భేటీ అయినప్పటికీ, చివరికి ఆయనకు అక్కడా రిక్త హస్తమే మిగిలింది. ఈ విషయాన్ని బోడె ప్రసాద్‌ స్వయంగా కార్యకర్తలకు స్పష్టంచేశారు. అయితే బోడె యనమలకుదురు కాలవకట్ల మీద ప్రచారం చేస్తున్న క్రమంలో సోమవారం అధిష్టానం నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని తీపికబురు వినబోతున్నామంటూ బోడె వర్గీయులు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. దీంతో బోడెకు దాదాపుగా సీటు ఖరారు అయ్యిందా? అన్నట్లు ప్రచారం చేశారు.

అయితే బోడె తనవెంట ఎవరినీ తీసుకెళ్లకుండా ఆయన ఒక్కడే కారులో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ చంద్ర బాబుతో భేటి కాలేదని, అక్కడి పెద్దలను కలిసి వచ్చినట్లుగా టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. దీంతో కేవలం పబ్లిసిటీ కోసం, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా బోడె తనవర్గీయులతో కలిసి ఇలా పబ్లిసిటీ స్టంట్‌ చేశారని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి తేలి ఉంటే నియోజకవర్గంలో సంబరాలు జరిగేవి కాదా? అన్నప్రశ్నలూ వ్యక్తమవుతున్నాయి. రోజుకో విధంగా జరుగుతున్న ప్రచారాలు, కొత్త వ్యక్తుల రంగప్రవేశం టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేస్తున్నాయి. అధిష్టానం సీటు తేల్చకుండా సాగదీస్తుండటంపై వారిలో ఉత్కంఠ నెలకొంది. సీటు ఎవరికి ఇస్తారనే విషయాన్ని తేల్చకుండా ఇలా కార్యకర్తలను నిరీక్షణకు గురిచేస్తుండటం తగదంటూ చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు