పేదలకు ‘ఆరోగ్య’ రక్ష | Sakshi
Sakshi News home page

పేదలకు ‘ఆరోగ్య’ రక్ష

Published Sat, Nov 18 2023 1:54 AM

 వైద్యశిబిరంలో పరీక్షిస్తున్న వైద్యులు             వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది  - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాధారణ జ్వరం వస్తే కూడా ఎక్కడో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా ఉన్న ఊళ్లోనే వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభమైన ఉచిత వైద్యశిబిరాలు విజయవంతంగా ముగిశాయి. వందలాది వైద్యశిబిరాల్లో లక్షలాది మంది ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఫలితంగా జబ్బు ఉన్నా ఆసుపత్రికి వెళ్లే స్థోమత, ఓపిక లేకుండా ఇంట్లోనే ఉండిపోయిన పేదలు ఈ వైద్యశిబిరాల ద్వారా చికిత్స పొందారు.

జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, 28 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 426 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. ఆయా ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజలకు ఏఏ వ్యాధులు ఉన్నాయి, వారికి మరింత మెరుగైన ఆరోగ్యం ఎలా అందించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 15 రోజుల ముందుగా వలంటీర్లు కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఎవరికి ఏఏ వ్యాధులు ఉన్నాయో గుర్తించి, వైద్యపరీక్షలు చేసి జాబితా తయారు చేశారు. ఈ జాబితా మేరకు ఆయా గ్రామాలు, వార్డుల పరిధిలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాలకు వారిని తరలించారు. దాదాపు 45 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏ వైద్యశిబిరం చూసినా సగటున 400 మంది చొప్పున హాజరై వైద్యపరీక్షలు, చికిత్సలు చేయించుకుని మందులు తీసుకెళ్లారు. ఇందుకోసం సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాల, మెడికల్‌ కళాశాలల నుంచి స్పెషలిస్టు వైద్యులను నియమించారు. వారి పరిధి గాని వ్యాధులు ఏమైనా ఉన్న వారిని జిల్లా కేంద్రంలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు.

635 వైద్యశిబిరాల్లో 2,21,583 మందికి చికిత్స

జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయ పరిధిలో 45 రోజుల పాటు 635 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరాల్లో 2,21,583 మంది ప్రజలు ఓపీ ద్వారా చికిత్స తీసుకున్నారు. ఇందులో 1,04,933 మంది పురుషులు, 1,16,649 మంది సీ్త్రలు ఉన్నారు. 2,21,307 మందికి వైద్యులు మందులు అందజేశారు. ఇందులో 32,078 మందికి కంటి వెలుగు కింద చికిత్స చేశారు.

78,868 మందికి వ్యాధుల నిర్ధారణ

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలల్లో చికిత్స పొందిన 2,20,248 మందిలో 78,868 మందికి వివిధ వ్యాధులున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇందులో బీపీ 9,667, షుగర్‌ 4,316, కంటివ్యాధులు 3,031, కుష్టు 722, టీబీ 238, రక్తహీనత 58,486 మందికి ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో 2,181 మందిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పేయింగ్‌ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అవసరమైన ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యమందిస్తున్నారు.

ముగిసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు

పేదల ముంగిటకే వచ్చిన వైద్యులు, సిబ్బంది

శిబిరాలతో లక్షలాది మందికి లబ్ధి

వైద్యపరీక్షలు, మందులు, చికిత్స ఉచితం

జిల్లా వ్యాప్తంగా 635 వైద్య శిబిరాలు, 2,21,583 మందికి చికిత్స

Advertisement
Advertisement