మంత్రియోగం.. అల్లంత దూరం | Sakshi
Sakshi News home page

మంత్రియోగం.. అల్లంత దూరం

Published Thu, Nov 9 2023 1:24 AM

కొడంగల్‌ పట్టణ వ్యూ..
 - Sakshi

కొడంగల్‌ నియోజకవర్గానికి 56ఏళ్లుగా దక్కని అదృష్టం

1967లో అచ్యుతారెడ్డికి ‘మంత్రి పదవి’

ఐదు సార్లు గెలిచిన గురునాథ్‌రెడ్డికి లభించని పదవి

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌,

కాంగ్రెస్‌ మధ్యనే పోటీ

నియోజకవర్గం : కొడంగల్‌

మండలాలు : కొడంగల్‌, దౌల్తాబాద్‌,

బొంరాస్‌పేట, దుద్యాల, మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్‌.

మున్సిపాలిటీలు : కొడంగల్‌, కోస్గి

కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,30,251

ఇతరులు 12

కోస్గి: నియోజకవర్గ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వడంలో నిష్ణాతులు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా కొడంగల్‌లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్‌, టీడీపీల మధ్యనే పోటీ ఉండేది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉంది. శాసనసభ్యుల్లో గురునాథ్‌రెడ్డి, నందారం వెంకటయ్యలు ముఖ్యులు. గురునాథ్‌రెడ్డి ఐదుసార్లు, నందారం వెంకటయ్య మూడు సార్లు గెలిచారు. ఈ ప్రాంతంలో ఒకసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరోదఫా టీడీపీని గెలిపించేవారు. 2018 ఎన్నికల వరకు కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్యనే పోటీ ఉండేది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన పక్షాలుగా పోటీ చేస్తున్నాయి. నియోజకవర్గానికి 14 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒక సారి ఉప ఎన్నిక జరిగింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే కొడంగల్‌కు మంత్రి పదవి దక్కింది.

ఎవరెన్ని సార్లు గెలిచారు

నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. 2018లో మొదటిసారి కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు.

నియోజకవర్గం ఏర్పడిందిలా..

1956లో కొడంగల్‌ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొడంగల్‌, కోస్గి, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాలతో పాటు మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని పలు గ్రామాలు కోయిలకొండలోని ఒక గ్రామ పంచాయతీ కలిసి నియోజకవర్గంగా ఉండేది. 2018 వరకు కొడంగల్‌, కోస్గి, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, మద్దూర్‌ మండలాలు కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. 2023 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన మూడు మండలాలు దుద్యాల, కొత్తపల్లి, గుండుమాల్‌ కలిశాయి. దీంతో ప్రస్తుతం 8 మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో కొడంగల్‌, కోస్గి పట్టణాలకు పురపాలిక హోదా దక్కింది. కొడంగల్‌తో పాటు కొండారెడ్డిపల్లి, ఐనన్‌పల్లి, బూల్కాపూర్‌, పాత కొడంగల్‌, గుండ్లకుంటను కలిపి మున్సిపాలిటీగాను, కోస్గితోపాటు పోతిరెడ్డిపల్లి, సంపల్లి, మల్‌రెడ్డిపల్లి, గుండ్లపల్లి, తిమ్మాయపల్లి, మాసాయపల్లి, నాగుసాన్‌పల్లిను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.

1994లో తెలుగుదేశం పక్షాన గెలిచిన నందారం వెంకటయ్య 1996లో చనిపోవడంతో కొడంగల్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో దివంగత నందారం వెంకటయ్య రెండో కుమారుడు నందారం సూర్యనారాయణ టీడీపీ టికెట్‌పై గెలిచారు.

ఒక్కసారే మంత్రి యోగం..

నియోజకవర్గం ఏర్పడి 62 ఏళ్లు గడుస్తున్నా మంత్రి పదవి మాత్రం ఒక్కసారే దక్కింది. నాగర్‌కర్నూల్‌ నుంచి ఇక్కడికి వచ్చి గెలిచిన అచ్యుతారెడ్డికి 1967లో మంత్రి పదవి లభించింది. కొంతకాలం రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 56ఏళ్లు అయినా మంత్రి యోగం దక్కలేదు.

సామాజిక వర్గాల వారీగా ఓటర్లు

ముదిరాజులు 60 వేలు, మున్నూరుకాపులు 30 వేలు, గొల్ల కురుమలు 40 వేలు, రెడ్లు 20 వేలు, ముస్లింలు 20వేలు, ఎస్సీలు 20వేలు, ఎస్టీలు 15 వేలు, వైశ్యులు, బ్రాహ్మణులు, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, ఇతర కులస్తులు 35 వేలు.

నియోజకవర్గంలో ముదిరాజులు, మున్నూరుకాపులు, గొల్లకురుమలు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. కొడంగల్‌, కోస్గి మండలంలో మున్నూరుకాపుల ప్రాభల్యం అధికంగా ఉంది. మద్దూరు, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌లో ముదిరాజు, యాదవ, రెడ్డి, లంబాడ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. బొంరాస్‌పేటలో తండాలు అధికంగా ఉన్నాయి. ఎస్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దౌల్తాబాద్‌లో మున్నూరుకాపులు, ముదిరాజులు, ఎస్సీలు, రెడ్డి వర్గాల వారు ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం. మూన్నూ రు కాపు, ముదిరాజ్‌, ముస్లిం, మాదిగ, లంబాడ కులస్తుల ఓట్లు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటి వరకు వివిధ సామాజిక వర్గాలకు చెందిన బల మైన నాయకులు పోటీ చేశారు. గతంలో నందా రం వెంకటయ్య, గురునాథ్‌రెడ్డి కుటుంబాల మధ్యనే రాజకీయం నడిచింది. గెలుపుఓటములు ఈ రెండు కుటుంబాల మధ్యనే ఉండేవి. ప్రస్తు త పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది.

కొడంగల్‌ మ్యాప్‌

ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు..

మహిళా ఓటర్లు 1,16,099

పురుష ఓటర్లు 1,14,140

నాటి కర్రకల్లు.. నేటి కొడంగల్‌

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో కొడంగల్‌ ఉన్నందున ఈ ప్రాంత ప్రజలు కన్నడ భాషను మాట్లాడేవారు. ఇక్కడ నల్ల బండరాళ్లు ఎక్కువగా దొరికేవట. అందుకే ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటి పైకప్పు నల్లరాళ్లతోనే కప్పి ఉంటాయి. కన్నడ భాషలో కల్లు అంటే రాయి అని అర్థం. ఈ నియోజకవర్గం కర్ణాటకలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని కర్రకల్లు అని పిలిచేవారు. కాలక్రమంలో కర్రకల్లు కొడంగల్‌గా మారిందని పెద్దలు చెబుతారు. నిజాం పాలనలో కర్రకల్లును హిమాయత్‌నగర్‌గా మార్చా లని భావించారట. అయితే ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు.

స్వాతంత్య్రానికి పూర్వమే పురపాలిక

కొడంగల్‌ పట్టణం స్వాతంత్య్రానికి పూర్వం నిజాం పాలనలో మున్సిపాలిటీగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్‌ నవాబుల పాలనలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు వెళ్లాలంటే కొడంగల్‌ మీదుగా వెళ్లేవారు. వారి హయాంలోనే హైదరాబాద్‌ నుంచి బీజాపూర్‌ వరకు కొడంగల్‌ మీదుగా రహదారి నిర్మించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పూర్వం అంటే 1956 వరకు ఈ నియోజకవర్గం ప్రస్తుత ఈశాన్య కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉండేది.

హ్యాట్రిక్‌ తప్పిన నేతలు

మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి రెండుసార్లు హ్యాట్రిక్‌ తప్పిపోయింది. 1978, 1983లో వరుసగా విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో హ్యాట్రిక్‌ తప్పిపోయింది. మరోసారి 1999, 2004లో ఆయన గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇలా రెండుసార్లు ఆయనకు హ్యాట్రిక్‌ తప్పింది. ఎనుముల రేవంత్‌రెడ్డి 2009, 2014లో వరుసగా గెలిచారు. 2018లో ఓడిపోవడంతో ఆయనకు హ్యాట్రిక్‌ తప్పింది.

1/8

2/8

రేవంత్‌రెడ్డి
3/8

రేవంత్‌రెడ్డి

గురునాథ్‌రెడ్డి
4/8

గురునాథ్‌రెడ్డి

దివంగత నందారం వెంకటయ్య
5/8

దివంగత నందారం వెంకటయ్య

నరేందర్‌రెడ్డి
6/8

నరేందర్‌రెడ్డి

దివంగత 
అచ్యుతారెడ్డి
7/8

దివంగత అచ్యుతారెడ్డి

దివంగత నందారం సూర్యనారాయణ
8/8

దివంగత నందారం సూర్యనారాయణ

Advertisement
Advertisement