స్థానికులతో గొడవ.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

4 Jan, 2024 10:58 IST|Sakshi

గోపాల్‌పేట: నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన బీసమ్మకు కూతురు, కుమారుడు ఉండగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కూతురు వారి అత్తారింటికి వెళ్లగా, కుమారుడు పరశురాములు భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

మంగళవారం మండల కేంద్రంలో ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చేందుకు పరశురాములు వచ్చాడు. సాయంత్రం స్థానికులతో చిన్నపాటి గొడవ అయ్యింది. దీంతో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఉన్న పెట్రోల్‌ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు.

అనంతరం నొప్పి తాళలేక కేకలు వేశాడు. నిద్రలేచిన తల్లి బీసమ్మ మంటలు ఆర్పి అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించినట్లు తెలిసింది.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

బైక్‌పై నుంచి పడి వివాహిత దుర్మరణం
కల్వకుర్తి టౌన్‌: సొంత పనులు ముగించుకొని ఇంటికి బైక్‌పై తిరిగి వెళ్తున్న భార్యభర్తలు ప్రమాదవాశత్తు కిందపడగా, భార్య మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్కొండ మండలంలోని జకినాలపల్లి అమ్మాయిపల్లి తండాకు చెందిన దేవేందర్‌, ఆయన భార్య కవిత (28)తో కలిసి కల్వకుర్తికి సొంత పనుల నిమిత్తం వచ్చారు.

పనులు ముగించుకుని ఇంటి వద్ద నీటి కోసం డ్రమ్మును తీసుకొని బైక్‌పై తిరుగు పయణమయ్యారు. పట్టణంలోని ఎల్‌ఐసీ ఆఫీస్‌ వద్దకు రాగానే బైక్‌పై గాలికి తోడు డ్రమ్ము ఖాళీగా ఉండటంతో డ్రమ్ముతో సహా కవిత జారి కిందపడిపోయింది.

వెంటనే దేవేందర్‌ కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తలకు తీవ్ర గాయం కావటంతో అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి
బాలానగర్‌:
బాలానగర్‌ మండలంలోని అప్పాజిపల్లికి చెందిన కొత్తూర్‌ శారద (32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. గత డిసెంబర్‌ 28న వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగగా.. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి దగ్ధం
ఉప్పునుంతల: మండలంలోని మర్రిపల్లిలో బుధవారం మధ్యాహ్నం బంటు సైదులుకు చెందిన ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇంట్లోని తిండి గింజలతో పాటు ఇతర వస్తువులు, సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. రూ.50 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లింది.

ఆ సమయంలో సైదులు కుటుంబ సభ్యులు వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు నీళ్లు చల్లి మంటలు ఆర్పి వేశారు.

ఆపాటికే ఇంట్లో ఉన్న బియ్యం, టీవీ, ఇతర వస్తువులు, దుస్తులు, పాలతిన్‌ కవర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు