విద్యార్థులు ఉత్తమపౌరులుగా ఎదగాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉత్తమపౌరులుగా ఎదగాలి

Published Thu, Jan 4 2024 12:38 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ అన్నారు. ఈ మేరకు పీయూలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఇండక్షన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్యాంపస్‌లో ఎలాంటి భయాందోళనకు గురికాకుండా చదువులపై దృష్టిసారించాలని, క్యాంపస్‌లోని సౌకర్యాలు వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. సీనియర్‌ న్యాయవాది సంధ్యారాణి మాట్లాడుతూ సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌ పేరిట ఇబ్బంది పెట్టొద్దని, దీనివల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంలో ఉంటే ఒత్తిడిని జయించవచ్చని, ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సైకాలజిస్టు రవీందర్‌, రిజిస్ట్రార్‌ గిరిజ, అధ్యాపకులు రాజ్‌కుమార్‌, రాజేష్‌, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌ పాల్గొన్నారు.

పీయూ వీసీ పేరుతో తప్పుడు మెసేజ్‌లు

పాలమూరు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ పేరుతో తప్పుడు వాట్సాప్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తన పేరుతో ఇతరులను డబ్బులు అడుగుతున్నట్లు తప్పుడు మెసేజ్‌లు పంపిస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు. వీటిపై ఎవరూ స్పందించవద్దని, అవి పూర్తిగా తప్పుడు మెసేజ్‌లు అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మాల్‌ప్రాక్టీస్‌ విద్యార్థులు హాజరుకావాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల పరీక్షల్లో 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ కింద బుక్‌ అయిన విద్యార్థులు శుక్రవారం కళాశాల ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌లో మధ్యాహ్నం 2గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్‌ పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాల్‌ ప్రాక్టీస్‌కు కారణాలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

గ్యారంటీ పథకాలువర్తింపజేయాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆరు గ్యారంటీ పథకాలను వర్తింపజేయాలని ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక పారిశ్రామికవాడలోని ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్‌ ద్వారా అతికొద్ది పెన్షన్‌ రూ.వెయ్యి నుంచి 3 వేలలోపు వస్తుందని, చాలీచాలని పెన్షన్‌తో ఎలా జీవించాలని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలతో తమ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆరు గ్యారంటీ పథకాలను వర్తింపజేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు జీబీ పాల్‌, నారాయణ, నాగాంజనేయులు, మోహన్‌రెడ్డి, బీహెచ్‌ కుమార్‌, ఉమేష్‌కుమార్‌, ఆర్‌.నారాయణ, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు.

కందుల ధర రూ.8,622

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,622, కనిష్టంగా రూ.8,509గా ధరలు నమోదయ్యాయి. ఆముదాల ధర గరిష్టంగా రూ.5,312, కనిష్టంగా రూ.5,300గా ధరలు వచ్చాయి.

చిన్నరాజమూరుఅంజన్నకు పూజలు

దేవరకద్ర: మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామికి బుధవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. 11 రోజులుగా జరుగుతు న్న జాతర ఉత్సవాల్లో నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పల్లకీసేవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జాతర ఉత్సవాలకు నిత్యం వందలాది భక్తులు తరలివస్తున్నారు. మరో రెండు వారాల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

1/1

Advertisement
Advertisement