చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!

25 Nov, 2023 04:42 IST|Sakshi

కేసుల వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

సుప్రీంకోర్టు ఆదేశాలతో దినపత్రికల్లో ప్రకటనలు!

మెదక్‌లో ఇద్దరు, నర్సాపూర్‌లో ఒక్కరు వెల్లడి..

సాక్షి, మెదక్‌: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు.

పారదర్శకంగా వ్యవహరించాలి..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్‌ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్‌ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్‌ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ముగ్గురు అందజేత..
మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్‌ కటింగ్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..?

మరిన్ని వార్తలు