వస్తారా.. రారా..?

25 Nov, 2023 04:42 IST|Sakshi

కండువా మార్చిన నాయకులతో వెళ్లని కేడర్‌..

కార్యకర్తల వైఖరితో నేతల ఇబ్బందులు!

తలలు పట్టుకుంటున్న నాయకులు

సాక్షి, మెదక్‌: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది వివిధ పార్టీల కండువాలు మార్చారు. అయితే, వారికి సంబంధించిన కేడర్‌ మాత్రం తమతోపాటు రాకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ వెంట వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. అది కూడా కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల్లో కండువాలు మార్చిన నేతలు చాలా మందే ఉన్నారు.

వీరితోపాటు వెళ్లడానికి కార్యకర్తలు మాత్రం వెనుకడుగు వేశారు. దీంతో ‘‘నిన్న, మొన్నటి వరకు నా వెంట ఉండి, పార్టీ మారాక నాతో రావా, నీ సంగతి చూస్తా’’అంటూ పార్టీ మారిన నాయకులు ధమ్‌కీ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో ఓ పార్టీనేత ఎమ్మెల్యే టికెట్‌ ఆశించగా అతడికి టికెట్‌ లభించలేదు. వెంటనే మరో పార్టీలోకి జంప్‌ అయ్యాడు. కానీ, ఆ నాయకుడి వెంట కేడర్‌ మాత్రం వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతం నచ్చి వారు ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఆ నాయకుడు ‘‘నా వెంట మీరు రావాల్సిందే’’అని పలు వురు కార్యకర్తలను బెదిరించగా వారు వాగ్వాదానికి దిగారు.

మర్యాద కరువు..
పార్టీలు మారిన నేతల వెంట కేడర్‌ వెళ్లకపోవడంతో కొత్తపార్టీలో ఆ నేతకు మర్యాద కరువైందని, ఎవరూ తమకు విలువ ఇవ్వడంలేదని జంప్‌జిలానీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యర్థులుగా తిట్టుకున్న నేతలు ఒకేపార్టీలో చేరడంతో బలాలు, బలగాల లెక్కలపై పంచాయితీలు పెట్టుకుంటూ, జంప్‌ జిలానీలను సీనియర్‌ నాయకులు సూటిపోటీ మాటలతో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారిన నేతలు కొత్త పార్టీలో ఇమడలేక నామూ షీగా ఫీలవుతున్నట్లు సమాచారం.
ఇవి చదవండి: కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్‌

మరిన్ని వార్తలు