ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం

25 Nov, 2023 08:19 IST|Sakshi

కాంగ్రెస్‌ గెలుపుతోనే తెలంగాణ యువత కల సాకారం: ప్రియాంకా గాంధీ

బీఆర్‌ఎస్, బీజేపీ.. బొమ్మా బొరుసు ఆ పార్టీలకు ఎంఐఎం అంటకాగుతోంది

యువత జీవితాలను కేసీఆర్‌ చీకట్లోకి నెట్టారు.. రైతులు, మహిళలకు ఏం చేశారని ఓట్లు అడుతున్నారు?

మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రచారం 

సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్‌: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్‌ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్‌ఎస్‌కూ కాలం చెల్లింది. ఓటమికి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అంతిమ గడియలు లెక్కపెట్టుకుంటోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ ఆగం చేశారన్నారు. ‘మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ప్రజలు చైతన్య వంతులు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచి్చందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోందని చెప్పారు.

ఈ చైతన్యంతో ఫాం హౌజ్‌లో ఉండి పాలించే నాయకులు కావాలో.. ప్రజల మధ్య ఉండి పాలించే కాంగ్రెస్‌ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పరిధిలోని తొర్రూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం ప్రజలు చేసిన పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉందని చెప్పారు.  

యువత జీవితాలు చీకటి మయం 
‘రాష్ట్రం సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్‌ యువత జీవితాలను చీకటి మయం చేశారు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. పేపర్‌ లీకేజీలతో చదువుకున్న వారి భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లింది. ఉద్యోగం రాలేదని విద్యారి్థని ఆత్మహత్య చేసుకుంటే. ఆ కుటుంబాన్ని ఓదార్చా ల్సిన ప్రభుత్వం, నాయకులు అసలు ఆమె పరీక్షే రాయలేదని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ప్రభుత్వానికి యువతపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరిగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మంచి విద్యను అందించేందుకు ప్రతీ మండలంలో ఒక ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ స్కూల్‌ను నెలకొల్పుతామన్నారు. 
 
మహిళగా వారు పడే బాధలు తెలుసు 
‘ఒక మహిళగా తెలంగాణలో మహిళలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఉప్పులు పప్పుల రేట్లు పెరిగినప్పుడు, గ్యాస్, కరెంట్‌ బిల్లులు భారమైనప్పుడు మహిళలే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇటువంటి ఖర్చులను అధిగమించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన పథకాలు అమలు చేస్తాం’ అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. సాగునీటి కోసం రూ.లక్ష కోట్లు వెచి్చంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందన్నారు.  
 
బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే..  
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రెండు పారీ్టలూ ఒక్కటే.. వారికి మద్దతుగా ఎంఐఎం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. డబ్బులు పెరిగితే మనిíÙలో అహం పెరుగుతుందని, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు అహం పెరిగి ప్రజల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పార్లమెంట్‌లో పెట్టిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలకు అంటకాగుతున్న ఎంఐఎం నాయకులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ను విమర్శించడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్నాయని ప్రియాంక చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. నాన్న (రాజీవ్‌ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అభ్యర్థులు యశస్వినిరెడ్డి (పాలకుర్తి), పొన్నం ప్రభాకర్‌ (హుస్నాబాద్‌), పార్టీ రాష్ట ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, కర్ణాటక మంత్రులు దినేష్‌ గుండూరావు, తీన్మార్‌ మల్లన్న,  తదితరులు పాల్గొన్నారు. 
 
కాంగ్రెస్‌ ప్రజలను నమ్ముకుంది: పొంగులేటి 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దయాకర్‌రావు డబ్బులను నమ్ముకున్నారని, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజలను నమ్ముకున్నారని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో ఇచి్చన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ 9, మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం గెలుస్తుందని చెప్పారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం కేసీఆర్‌ మాత్రమే అనుభవిస్తున్నారని, మన త్యాగాల ఫలం మనమే అనుభవించాలంటే కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.  


 
ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం  
ప్రియాంక ఉన్న ఫళంగా ఓ గీతకార్మికుడి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభను ముగించుకొని కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో కిషన్‌నగర్‌లో నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇంటికి మామిడి తోరణాలు, బంతిపూల దండలు కనిపించడంతో ప్రియాంక కారు ఆపి వారి ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ యజమాని గీత కార్మికుడు జాగిరి రాజయ్య, రమ దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండటంతో పూజ గురించి ఆరా తీశారు. ఇంటి నిర్మాణం ఎందుకు ఆపారని, దుకాణం ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. దీంతో ఇంటి యాజమాని ఆర్థిక ఇబ్బందులే కారణమన్నారు. ఇంటి యజమానురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు