నీలం మధుకే మెదక్‌ టికెట్‌

28 Mar, 2024 09:41 IST|Sakshi

కలిసొచ్చిన సామాజిక సమీకరణ

లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారు చేసిన కాంగ్రెస్‌ వీడిన ఉత్కంఠ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టికెట్‌ నీలం మధు ముదిరాజ్‌కు దక్కింది. బీసీ సామాజిక సమీకరణ ఈయనకు కలిసొచ్చింది. ఇదివరకే ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఓసీలకు టికెట్లు కేటాయించాయి. కాగా, కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా బీసీ నేతను బరిలోకి దింపుతోంది.

ఈ అభ్యర్థిత్వం విషయమై నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. బీఆర్‌ఎస్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌.నరేంద్రనాథ్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకుంటారని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరిగింది. మరో పారిశ్రామికవేత్త పేరు సైతం వినిపించింది. కానీ హస్తం పార్టీ అధినాయత్వం చివరకు మధు వైపే మొగ్గు చూపింది. ఆయనకు సీఎం రేవంత్‌ ఆశీస్సులున్నాయి.

బీఎస్పీ నుంచి పోటీ
బీఆర్‌ఎస్‌లో చాలా కాలం కొనసాగిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు స్థానం నుంచి టికెట్‌ ఆశించారు. దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్నారు. చివరి క్షణంలో ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను పార్టీ బరిలోకి దింపడం తెలిసిందే. దీంతో మధు బీఎస్పీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్‌ చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఈ టికెట్‌ దక్కింది.

వార్డుమెంబర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా..
మధు.. 2001లో బీఆర్‌ఎస్‌తో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో వార్డ్‌ మెంబర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో చిట్కూర్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్‌ఎంఆర్‌ ఫౌండేషన్‌ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనకు పటాన్‌చెరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. ప్రధానంగా ముదిరాజ్‌ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బరిలోకి దించడం ద్వారా ఆ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహించినట్లు అవుతుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తోంది.

Election 2024

మరిన్ని వార్తలు