Aamir Khan: పెద్ద డైలాగులు కొడతాడు, కానీ ఇదీ రియాలిటీ!

13 Jul, 2021 10:33 IST|Sakshi

అమీర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "లాల్‌ సింగ్‌ చద్దా". లద్దాఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య కూడా సెట్స్‌లో జాయిన అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్‌ లద్దాఖ్‌లోని వాఖా గ్రామంలో చిత్రయూనిట్‌ షూటింగ్‌ జరిపిన ప్రదేశాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలోని ప్రదేశంలో 'లాల్‌ సింగ్‌ చద్దా' టీం వదిలేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ దర్శనమిస్తున్నాయి.

"వాఖా గ్రామస్తుల కోసం అమీర్‌ ఖాన్‌ ఇచ్చిన బహుమతి ఇది. అమీర్‌ పర్యావరణం, శుభ్రత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. సత్యమేవ జయతే అంటూ నినాదాలిస్తాడు. కానీ అసలు విషయం మాత్రం ఇదీ.." అంటూ అతడు హీరో టీం తీరుపై మండిపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'సినిమా బడ్జెట్‌ కోట్లలో ఉన్నప్పుడు ఇది క్లీన్‌ చేయడానికి ఏం మాయరోగం', 'మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు అనడానికి ఇదే నిదర్శనం' అంటూ చిత్రయూనిట్‌ను ఏకిపారేస్తున్నారు. అయితే లద్దాఖ్‌లో షెడ్యూల్‌ ఇంకా పూర్తవనందునే ఆ ప్రాంతాన్ని ఇంకా శుభ్రం చేసి ఉండకపోవచ్చని అమీర్‌ను వెనకేసుకొస్తున్నారు ఆయన అభిమానులు. 

మరిన్ని వార్తలు