హీరోగా మారిన ప్రభాకర్‌ తనయుడు.. ఆ పాటతో సినిమా చాన్స్‌!

17 Sep, 2022 10:37 IST|Sakshi

‘‘నేను ఇండ్రస్టీకి వచ్చి 25ఏళ్లు అయింది. మా అబ్బాయి చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది నా భార్య మలయజ. తాను చేసిన యూ ట్యూబ్‌ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే చంద్రహాస్‌ హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది’’ అని నటుడు ప్రభాకర్‌ అన్నారు. ఆయన తనయుడు చంద్రహాస్‌ హీరోగా పరిచయం కానున్నాడు. నేడు(సెప్టెంబర్‌ 17) చంద్రహాస్‌ పుట్టిరోజు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాకర్‌ మాట్లాడుతూ– ‘‘చంద్రహాస్‌ చేసిన ‘నాటు నాటు..’ అనే కవర్‌ సాంగ్‌ మంచి పేరుతో పాటు హీరోగా రెండు అవకాశాలు తేవడంతో ఆశ్చర్యపోయాను. వీటిలో కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మిస్తున్న సినిమా, సంపత్‌ వి. రుద్ర డైరెక్షన్‌లో ఏవీఆర్, నరేష్‌గార్లు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. అలాగే మా స్వంత సంస్థలో ఓ సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు.

ప్రభాకర్‌ భార్య మలయజ మాట్లాడుతూ.. ‘చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

‘‘పరిశ్రమలోని చాలామందిని చూసి నటుడిగా స్ఫూర్తి పొందాను.. ముఖ్యంగా రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌గార్లు.. వారి అంకితభావానికి హ్యాట్సాఫ్‌. హీరో అవ్వాలనేది నా కల.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కోసం కష్టపడతాను’’ అన్నారు చంద్రహాస్‌.

మరిన్ని వార్తలు