మయాంక్‌ మెరుపు శతకం.. పడిక్కల్‌ ఊచకోత.. ఆరేసిన చహల్‌

23 Nov, 2023 13:07 IST|Sakshi

దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్‌తో ఇవాళ (నవంబర్‌ 23) జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌తో పాటు రవి కుమార్‌ సమర్థ్‌ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్‌ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్‌, సమర్థ్‌ సెంచరీలతో చెలరేగడం విశేషం.

పడిక్కల్‌ ఊచకోత..
సమర్థ్‌ ఔటైన అనంతరం ఇ​న్నింగ్స్‌ 39వ ఓవర్‌లో బరిలోకి దిగిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ జమ్మూ కశ్మీర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్‌ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పడిక్కల్‌కు జతగా మనీశ్‌ పాండే కూడా బ్యాట్‌ ఝులిపించాడు. మనీశ్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్‌ సలామ్‌, సాహిల్‌ లోత్రా తలో వికెట్‌ పడగొట్టారు. 

శతక్కొట్టిన దీపక్‌ హుడా.. ఆరేసిన చహల్‌
2023 సీజన్‌ విజయ్‌ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్‌ కెప్టెన్‌ దీపక్‌ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (66 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్‌, హర్యానా బౌలర్‌ యుజ్వేంద్ర చహల్‌ 6 వికెట్లతో ఇరగదీశాడు.  

మరిన్ని వార్తలు