ఈ ఏడాది ఈమె టాప్‌.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..

20 Dec, 2023 10:38 IST|Sakshi

సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు.

ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్‌(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్‌ మించిపోయారు.

దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్‌ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్‌అదానీ రెండో స్థానంలో ఉన్నారు.

జిందాల్‌ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్‌ జిందాల్‌ సతీమణే సావిత్రి జిందాల్‌. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్‌ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్‌ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు.

ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..

ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్‌ అధినేత శివ్‌నాడార్‌ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ బిర్లా, షాపూర్‌ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్‌ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిత్తల్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు