‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా నో చెప్పా, ఎందుకంటే.. : వాసుకి

10 May, 2023 07:24 IST|Sakshi

‘సిల్వర్‌ స్క్రీన్‌పై ఆర్టిస్టులు నటిస్తారు. కానీ మనుషులుగా మనందరం నిత్యం విభిన్నమైన సందర్భాలు, పరిస్థితుల్లో నటిస్తుంటాం. సో.. మనందరం నటులమే. ఇరవయ్యేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను భయపడలేదు. సెట్స్‌లో ఎక్కువగా టేక్స్‌ తీసుకోకుండానే యాక్ట్‌ చేశాను. అయినా నా భర్త ఆనంద సాయి (ఆర్ట్‌ డైరెక్టర్‌)తో నిత్యం సినిమాలు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నాను’’ అన్నారు వాసుకి.

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాసుకి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలే ప్రాధాన్యంగా అనిపించాయి.

(చదవండి: ఆదిపురుష్‌.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?)

ప్రస్తుతం ఫారిన్‌లో మా అమ్మాయి మెడిసిన్‌ ఫోర్త్‌ ఇయర్, అబ్బాయి ఆర్కిటెక్చర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నారు. దాంతో నాకు ఖాళీ దొరికింది. నేను సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. ఇటు నటిగా నాకు నచ్చే, నప్పే పాత్రలు చేస్తాను. ‘అన్నీ మంచి శకునములే’లో సంతోష్‌ శోభన్‌కు అక్కగా నటించాను. తమ్ముడ్ని సపోర్ట్‌ చేసే అక్క పాత్ర ఇది. కథ బాగుంటే తల్లిగా చేయడానికి కూడా రెడీ’’ అన్నారు.

మరిన్ని వార్తలు