Raj Tarun: రాజ్‌తరుణ్‌ ‘అహ నా పెళ్లంట’.. ఆ విశేషాలు ఏమిటంటే..

4 Apr, 2022 18:45 IST|Sakshi
రాజ్‌ తరుణ్‌పై క్లాప్‌ కొడుతున్న ఎంపీ భరత్‌ రామ్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌)/తూర్పుగోదావరి: తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాజ్‌ తరుణ్, శివానీ రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న అహ నా పెళ్లంట వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి దర్వకత్వంలో రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గరిమెళ్ల సత్యనారాయణ ట్రైనింగ్‌ కళాశాలలో షూటింగ్‌ మొదలైంది.

చదవండి: చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే

రాజ్‌తరుణ్, కమెడియన్‌ హర్షవర్థన్‌పై ఎంపీ భరత్‌ రామ్‌ క్లాప్‌ కొట్టగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్‌ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లకు రాజమహేంద్రవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సినిమా షూటింగ్‌లు, స్టూడియోల ఏర్పాటుకు విశాఖలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తర్వాత రాజమహేంద్రవరంలోని పిచ్చుకలంకను తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం జంధ్యాల తీసిన అహ నా పెళ్లంట సినిమాలాగా ఈ వెబ్‌ సిరీస్‌ విజయవంతం అవుతుందన్నారు. దర్శకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సిరీస్‌లో ఆమని, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తారన్నారు. 

మరిన్ని వార్తలు