Naandi Review: నరేశ్‌ ‘నాంది’ మూవీ ఎలా ఉందంటే..

19 Feb, 2021 12:57 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : నాంది
జానర్ : ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : అల్లరి నరేశ్,వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, హరీష్‌ ఉత్తమన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్
నిర్మాత : సతీష్ వేగేశ్న 
దర్శకత్వం : విజయ్ కనకమేడల
సంగీతం : శ్రీచరణ్‌ పాకల
సినిమాటోగ్రఫీ : సిద్
విడుదల తేది : ఫిబ్రవరి 19, 2021

అల్లరి నరేశ్ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో. వరుస కామెడీ సినిమాలతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టేవాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇటీవల ఆయన తీసిన సినిమాలు డిజాస్టర్ట్స్ అయ్యాయి. దీంతో ఈ ‘అల్లరి’హీరో సీరియస్‌గా మారి 'నాంది' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో శుక్రవారం (ఫిబ్రవరి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా 'నాంది'లో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ పోషించడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తినెలకొంది. ఇక వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నరేశ్ కూడా నాందిపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. మరి నరేశ్ ప్రయోగం ఫలించి విజయం సాధించాడా? అల్లరోడి కెరీర్‌లో 57వ సినిమాగా రాబోతున్న ‘నాంది’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
బండి సూర్యప్రకాశ్ అలియాస్‌ సూర్య‌( అల్లరి నరేశ్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తల్లిదండ్రులంటే అతనికి ఎనలేని ప్రేమ. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎలాంటి సుఖాలను వదులుసుకున్నారో.. ఉద్యోగం వచ్చాక వాటన్నింటినితిరిగి ఇస్తాడు. ఇక కొడుకుకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు. ఇలా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్‌ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్‌ హత్యకేసులో అరెస్ట్‌ అవుతాడు. చేయని నేరాన్ని బనాయించి సూర్యని టార్చర్‌ పెడతాడు ఏసీపీ కిషోర్‌ (హరీష్‌ ఉత్తమన్). కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ శరత్‌ కుమార్) ఈ కేసును టేకప్‌ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు,ఎందుకు చంపారు?  ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్‌ ఎందుకు ఇరికించాడు? జైలులో ఉన్న సూర్యకి,  లాయర్‌ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్‌ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే మిగతా కథ

నటీనటులు
కేవలం నవ్వించడమే కాదు.. ఏడిపించడం  కూడా తెలుసు అని మరోసారి నిరూపించాడు అల్లరి నరేశ్‌. నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్న నరేశ్‌.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. కేవలం కామెడీ పాత్రలే కాదు భావోద్వేగ పాత్రలను కూడా చేయగలడని మరోసారి నిరూపించుకున్నాడు. సూర్య అనే మిడిల్‌ క్లాస్‌ యువకుడి పాత్రలో జీవించేశాడు. ప్రతి సన్నివేశాన్ని ప్రాణంపెట్టి చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. ఇక అడ్వకేట్‌ పాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్ ఒదిగిపోయింది. ఈ సినిమాకు నరేశ్‌ పాత్ర ఎంత ముఖ్యమో..వరలక్ష్మీ పాత్ర కూడా అంతే. తన అద్భతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోలెవల్‌కి తీసుకెళ్లింది. ఏసీపీ కిషోర్‌ అనే నెగెటివ్‌ పాత్రలో హరీష్‌ ఉత్తమన్ మెప్పించారు.  ప్రవీన్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ తమ పరిధి మేరకు నటించారు.    చదవండి: ('చక్ర' మూవీ రివ్యూ!)

విశ్లేషణ
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు.

‘ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు’ లాంటి డైలాగ్స్‌ గుండెల్ని హత్తుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ‘నాంది’ నరేశ్‌ కెరియర్‌లో అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక శ్రీచరణ్‌ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు. 

ప్లస్‌ పాయింట్స్‌
నరేశ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్ నటన
కథ, కథనం
ప్రీక్లైమాక్స్‌,  క్లైమాక్స్‌ భావోద్వేగ సన్నివేశాలు

మైనస్‌ 
సెకండాఫ్‌లో కథ రోటీన్‌గా సాగడం
కొన్ని సన్నివేశాలు రియాల్టీ నుంచి సినిమాటిక్‌ జోన్‌లోకి వెళ్లడం

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు