Pallavi Prashanth Arrest Case Updates: పల్లవి ప్రశాంత్ కేసు.. మరో 16 మంది అరెస్ట్!

21 Dec, 2023 16:43 IST|Sakshi

బిగ్ బాస్ సీజన్‌ - 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.  సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. 

అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు  ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్‌దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిదంటే... 

అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్‌ బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్‌ తన మిత్రుడు వినయ్‌ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను   పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు.  

అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్‌ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్‌ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. 

>
మరిన్ని వార్తలు