Sakshi News home page

WC 2023: శార్దూల్‌ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. ఎందుకిలా?: మాజీ పేసర్‌

Published Fri, Oct 13 2023 3:43 PM

WC 2023 Ind Vs Afg These Are Topi Masters: Sreesanth Slams Siraj Critics - Sakshi

ICC WC 2023- Team India: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు భారత మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ అండగా నిలిచాడు. మేనేజ్‌మెంట్‌ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్‌ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు.

కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్‌ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సిరాజ్‌ ఒక వికెట్‌ తీయగలిగాడు.

అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చి
పవర్‌ ప్లేలో మ్యాజిక్‌ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్‌ చేశాడు. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌ ఏకంగా 76 పరుగులిచ్చాడు.

9 ఓవర్ల బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్‌ షమీని కాదని సిరాజ్‌ను ఎంపిక చేసి మేనేజ్‌మెంట్‌ తప్పుచేసిందంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌.. ‘‘మ్యాచ్‌ మొదలుకావడానికి ముందు..

అసలేంటి ఇదంతా?
‘‘అయ్యో.. శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్‌ మొదలైన తర్వాత.. సిరాజ్‌ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. 

ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్‌పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని  స్పోర్ట్స్‌కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

తదుపరి పాకిస్తాన్‌తో
వెటరన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో.. పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మరికొందరు సిరాజ్‌ను టార్గెట్‌ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్‌ మీద 6, అఫ్గనిస్తాన్‌ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

చదవండి: WC: క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్‌ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్‌..: యువీ

Advertisement

What’s your opinion

Advertisement