Arvind Swamy: స్క్రీన్‌ వెనకాల పడ్డ కష్టం ప్రేక్షకులకు కనపడదు

9 Sep, 2021 07:58 IST|Sakshi

‘‘ఒక మంచి పాత్రలో నటించడానికి ప్రిపేర్‌ అవ్వడం ఒక ఎత్తు అయితే, కెమెరా ముందు సరిగ్గా చేయడం మరో ఎత్తు. ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉందన్నదే ముఖ్యం. ఎందుకంటే స్క్రీన్‌పై మంచి నటన కనబర్చడానికి స్క్రీన్‌ వెనకాల ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులకు కనపడదు’’ అన్నారు అరవింద్‌ స్వామి.

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించగా, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ పాత్రను అరవింద్‌ స్వామి చేశారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్న సందర్భంగా అరవింద్‌ స్వామి చెప్పిన విశేషాలు.

ఎంజీఆర్‌ (ఎం.జి. రామచంద్రన్‌), శివాజీ గణేశన్‌ గార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌గారు తనదైన ముద్ర వేశారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌గారు ‘తలైవి’లో ఎంజీఆర్‌ పాత్రను నాకు ఆఫర్‌ చేసినప్పుడు పెద్ద బాధ్యత అనిపించింది.

ఎంజీఆర్‌గారిలా ట్రాన్స్‌ఫామ్‌ అయి, ఆ పాత్ర చేయడం చాలెంజ్‌లా భావించాను. పాత్ర పరంగా నేను ఏ చిన్న తప్పు చేసినా ప్రేక్షకులు, ఆయన అభిమానులు బాధపడే అవకాశం ఉంది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి వందశాతం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఎంజీఆర్‌గారిని అభిమానించేవారందరూ నేను పోషించిన పాత్ర చూసి హ్యాపీ ఫీలవ్వాలని అనుకున్నాను.!

నిజానికి ఎంజీఆర్‌గారి బాడీ లాంగ్వేజ్‌కి నా బాడీ లాంగ్వేజ్‌ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన మేనరిజమ్స్‌ సినిమాల్లో ఒకలా, సాధారణ జీవితంలో మరోలా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం కోసం కష్టపడ్డాను. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నటుడిగా ఎదిగాక, ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు.. ఇలా ఓ నాలుగు భాగాలుగా విభజించుకుని లుక్స్‌ పరంగా ప్రిపేర్‌ అయ్యాను.

నేను ఎంజీఆర్‌ను కాదు... అరవింద్‌ స్వామిని. తెరపై ఆయనలా కనిపించడానికి ప్రయత్నించాను. ఒక నటుడిగా ఆయన పాత్ర చేశాను.. అంతే. ‘ధృవ’ సినిమా తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్స్‌ వచ్చాయి. కానీ కుదర్లేదు. ఇప్పుడు కరెక్ట్‌ స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడను. కథ ఆసక్తికరంగా ఉంటే చాలు.

 ఇరవయ్యేళ్ల క్రితమే నాకు దర్శకత్వం అంటే ఆసక్తి కలిగింది. కానీ యాక్టర్‌గా ఉన్న కమిట్‌మెంట్స్, ఇతర వ్యాపార వ్యవహారాల వల్ల డైరెక్షన్‌ చేయలేకపోయాను. ఇటీవల ‘నవరస’ ఆంథాలజీలో ‘రౌద్రం’ భాగానికి దర్శకత్వం వహించడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలున్నాయి. ఇవన్నీ మానవీయ సంబంధాల ఆధారంగా తయారు చేసుకున్న కథలే. 

మరిన్ని వార్తలు