Atharva Review: అథర్వ మూవీ రివ్యూ

1 Dec, 2023 15:13 IST|Sakshi
Rating:  

టైటిల్‌: అథర్వ
నటీనటులు: కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా, అరవింద్‌ కృష్ణ, కబీర్‌ సింగ్‌ యాదవ్‌, విజయ్‌ రామరాజు, గగన్‌ విహారి తదితరులు
నిర్మాత: సుభాష్‌ నూతలపాటి 
దర్శకత్వం: మహేశ్‌ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: చరణ్‌ మాధవనేని
విడుదల తేది: డిసెంబర్‌ 1, 2023

‘అథర్వ’ కథేంటంటే..
దేవ్‌ అథర్వ కర్ణ అలియాస్‌ కర్ణ(కార్తీక్‌ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్‌ కాలేకపోతాడు. చివరకు క్లూస్‌ టీమ్‌లో జాయిన్‌ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్‌ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్‌ చేస్తుంటాడు.

ఓసారి తన కాలేజీలో జూనియర్‌ అయిన నిత్య(సిమ్రన్‌ చౌదరి)..క్రైమ్‌ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్‌ జోష్నీ(ఐరా) ఓ స్టార్‌ హీరోయిన్‌.  ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్‌ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అథర్వ కూడా ఆ తరహా చిత్రమే. కేసు చేధించేందుకు పోలీసులు కాకుండా క్లూస్‌ టీమ్‌ ఉద్యోగి రంగంలోకి దిగడం ఈ సినిమా ప్రత్యేకత. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. హీరో తన తెలివి తేటలతో ఈ కేసును పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎలాంటి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారో అలాంటి పాయింట్‌తోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. 

సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. రాబరీ కేసు నుంచి సినిమా ఊపందుకుంటుంది. అసలు కథ మాత్రం జోష్ని, ఆమె ప్రియుడు మరణించాకే ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ స్లో అనిపిస్తుంది. ఆ తరువాత సినిమా చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. 

అయితే జంట హత్యలు చోటు చేసుకోవడం.. ఆ కేసును పోలీసులు హడావుడిగా మూసివేసినా.. క్లూస్‌ టీమ్‌లో పని చేసే హీరోకి అనుమానం రాకపోవడం కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తుంది.  ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ అయితే ఊహించని విధంగా ఉంటుంది. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
కర్ణ పాత్రకి కార్తీక్‌ రాజు న్యాయం చేశాడు. లవర్‌గా, క్లూస్‌ టీమ్‌ ఉద్యోగిగా రెండు రకాల పాత్రల్లో అలరించారు. . హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది.సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. శ్రీచరణ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు