మెగాస్టార్‌ ఇంట్లో బిగ్‌బాస్‌ తురుమ్‌ఖాన్‌ సందడి

23 Jan, 2021 09:28 IST|Sakshi

తనదైన ప్రదర్శనతో బిగ్‌బాస్ షోలో సయ్యద్‌ సోహేల్‌ సందడి చేశాడు. విజేత కన్నా అత్యధిక పాపులారిటీ సొంత చేసుకున్న ఈ తురుమ్‌ఖాన్‌ ఇప్పుడు తనను ప్రోత్సహించిన వారిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాడు. మొన్న బిగ్‌బాస్‌ వ్యాఖ్యాత కింగ్‌ నాగార్జునను కలిశాడు. ఇప్పుడు తాజాగా శుక్రవారం మెగాస్టార్‌ చిరంజీవిని కలిశాడు. చిరు నివాసానికి వెళ్లి సోహేల్‌ పుష్పగుచ్ఛం అందించాడు. చిరు కుటుంబంలో ఓ సభ్యుడిగా కలిసిపోయి సందడి చేశాడు.

బిగ్‌బాస్‌ షో ఆఖరి రోజు మొత్తం సోహేల్‌ చుట్టే కథ నడిచింది. సోహేల్‌కు చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. దీంతోపాటు సోహేల్‌ అనాథాశ్రమానికి చేస్తానన్న సహాయం వద్దు.. తాను చేస్తానని ప్రకటించాడు. సోహెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వ‌స్తాన‌ని బిగ్‌బాస్ ఫైనల్‌లో చిరు ప్రకటించాడు. ఈ అనుకోని వరాలకు సోహేల్‌ ఉబ్బితబ్బిబై ఏడ్చేశాడు. అలాంటి సోహేల్‌ ఇప్పుడు తనను ప్రోత్సహించిన చిరును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో పాటు తనకోసం బిర్యానీ వండి పంపిన చిరు భార్య సురేఖ, చిరంజీవి తల్లి అంజనాదేవిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కుటుంబసభ్యుడి మాదిరి చిరు ఇంట్లో సోహెల్‌ గడిపాడు.

సోహెల్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. జార్జిరెడ్డి ఫేమ్‌ నిర్మాత‌లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు