కాళ్లు ప‌ట్టుకుంటే బాగోదు, ప్లీజ్‌..: అవినాష్‌

24 Nov, 2020 22:48 IST|Sakshi

బిగ్‌బాస్ పెట్టిన నామినేష‌న్ మంట కంటెస్టెంట్ల గుండెల్లో జ్వాల‌గా ర‌గులుతోంది. ఆ అగ్ని కొంద‌రిని ద‌హిస్తోంటే మ‌రికొంద‌రిలో కొత్త ఆలోచ‌న‌లకు నాందిగా మారుతోంది. వెర‌సి తన గేమ్ త‌ను ఆడదామ‌నుకున్న మోనాల్ మ‌న‌సు ప‌రిప‌రివిధాలా ఆలోచిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అభిజిత్ ఆమెకు తోడుగా నిలుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక ఒక‌రి కోసం ఒక‌రు త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం లేద‌ని తెలుసుకున్న బిగ్‌బాస్ నామినేట్ అయిన‌వారికి నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. అయితే ఇందులో అవినాష్ గెలిచాడ‌న్న‌ది సోష‌ల్ మీడియాలో ఎప్పుడో తేల్చేసింది. కాక‌పోతే ఓ చిన్న ట్విస్టుంది. అదేమిటో తెలియాలంటే నేటి బిగ్‌బాస్ స్టోరీ మీద ఓ క‌న్నేయండి..

మ‌న‌సు విప్పి మాట్లాడుకున్న అభి, మోనాల్‌
నామినేష‌న్స్‌లో ల‌క్ క‌లిసి రాలేద‌ని అరియానా ఏడ్చేసింది. త‌ర్వాత మోనాల్ ఒంట‌రిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. క‌రెక్ట్ ప‌ర్స‌న్‌తో స్వాప్ చేయ‌మ‌ని చెప్పింది అఖిల్ గురించి అని మోనాల్ అస‌లు విష‌యం చెప్ప‌డంతో హారిక త‌న త‌ప్పును తెలుసుకుని సారీ చెప్పింది. నామినేష‌న్‌లో త‌న‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా అరిచిన‌ అరియానాకు బుద్ధి లేద‌ని కోప్ప‌డింది. మ‌రోవైపు ఒక‌రిని తొక్కి ముందుకు వెళ్ల‌డం ఇష్టం లేద‌న్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడ‌ని అఖిల్ సందేహం వ్య‌క్తం చేశాడు. త‌ర్వాత అభి, మోనాల్ రాత్రిపూట మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు. ఒక‌రికి ఒక‌రు సారీ చెప్పుకున్నారు. జ‌నాల‌ను క‌రెక్ట్‌గా అంచ‌నా వేసే మా నాన్న‌కు న‌చ్చావ‌ని చెప్పుకొచ్చాడు. మీ అమ్మ న‌న్ను చూస్తుంది.. కానీ నువ్వు చూడ‌ట్లేదు అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్‌)

హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల ప్ర‌చారం
త‌ర్వాత బిగ్‌బాస్ "ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్" ప్ర‌వేశ‌పెడుతూ నామినేట్ అయిన‌వారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. మొద‌టి లెవ‌ల్‌లో అవినాష్‌, అరియానా, అఖిల్‌, మోనాల్ పోటీప‌డ‌గా అవినాష్‌, అఖిల్ ఎక్కువ జెండాలు సేక‌రించి రెండో లెవ‌ల్‌కు వెళ్లారు. ఇందులో 'బీబీ- క‌ష్టానికే గెలుపు 'అన్న పార్టీ పేరుతో అఖిల్‌,  'గ‌మ్యం చేరే వ‌ర‌కు' పార్టీ పేరుతో అవినాష్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

క‌న్నీటితో అవినాష్ ప్ర‌చారం
ఇప్పుడు నాకు ఓటేస్తే నా జీవితంలో మ‌ర్చిపోలేను అంటూ అవినాష్ హారిక ద‌గ్గ‌ర‌ ఏడ్చేశాడు. దీంతో అరియానా అత‌డికి ధైర్యం నూరిపోసింది. త‌ర్వాత ప్ర‌చార స‌భ‌లు మొద‌లు పెట్టారు. ఇందులో అవినాష్ మాట్లాడుతూ.. మీ ఇంటి మ‌నిషే అనుకుని ఓటేయండి, ఫ్రెండ్స్ కాళ్లు ప‌ట్టుకుంటే బాగోదు క‌దా ప్లీజ్ ఓటేయండి అని మ‌రోసారి ఎమోష‌న‌ల్ అయ్యాడు. (చ‌ద‌వండి: సోహైల్‌ అర్ధ‌రాత్రి అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడు)

హారిక‌ను అమ్మ అని పిలుస్తా...
త‌ర్వాత అఖిల్‌.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవ‌స‌రం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్య‌ర్థించాడు. కానీ పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యేస‌రికి మోనాల్‌, సోహైల్.. అఖిల్‌కు పూల‌మాల వేసి ఓటేయ‌గా అరియానా, అభి.. అవినాష్‌కు ఓటేశారు. హారిక వేసే చివ‌రి ఓటే కీల‌కం కాగా ఆమె అవినాష్‌కే స‌పోర్ట్ చేసింది. దీంతో అవినాష్ ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేన‌ని ఆమెను అమ్మ అని పిలుస్తానంటూ ఓవ‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. అనంత‌రం అత‌డికి రెండు వారాల వాలిడిటీ ఉండే ‌ఇమ్యూనిటీ ద‌క్కింది. దీన్ని ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని బిగ్‌బాస్ స్ప‌ష్టం చేశాడు. దీంతో అత‌డికి రెండు వారాల‌పాటు ఇమ్యూనిటీ అన్న విష‌యంలో ఏమాత్రం నిజం లేద‌ని తేలింది. (చ‌ద‌వండి: అభిజిత్‌కు క్లాస్ పీకిన‌ మోనాల్ సోద‌రి)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు