నా కాన్సెప్ట్‌ను తస్కరించారు

12 Aug, 2020 09:18 IST|Sakshi

‘‘మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై 2017లోనే ఓ ఫిక్షనల్‌ స్టోరీ రాసి, రిజిస్టర్‌ కూడా చేయించాను. అయితే నా కాన్సెప్ట్‌ను వేరే వాళ్లు తస్కరించారు.  చట్టపరంగా వాళ్లు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని దర్శకుడు దేవా కట్టా అన్నారు. ‘ప్రస్థానం, ‘వెన్నెల, ఆటోనగర్‌ సూర్య’ వంటి సినిమాలతో దర్శకుడిగా తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. మంగళవారం దేవా కట్టా ట్విట్టర్‌  వేదికగా షేర్‌ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. వైఎస్, చంద్రబాబుల స్నేహం, రాజకీయ వైరాన్ని బేస్‌ చేసుకుని ఓ సిరీస్‌ రాబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో వచ్చింది.
(చదవండి : మరో వెబ్‌ సిరీస్‌లో జగపతి బాబు)

ఈ వార్త నేపథ్యంలో దేవా ఓ వ్యక్తిపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా స్ఫూర్తితో వైఎస్‌ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై మూడు భాగాలుగా స్క్రిప్ట్‌ రెడీ చేశాను. ఆ తర్వాత దాన్ని వెబ్‌ సిరీస్‌ ఫార్మాట్‌లోకి మార్పు చేసి, నా ఐడియాను పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వివరించాను. గతంలో నా స్క్రిప్ట్‌ తస్కరించిన ఓ వ్యక్తి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. కానీ ఈసారి అలా కానివ్వను’’ అన్నారు దేవా కట్టా. కాగా దేవా కట్టా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు? అనే చర్చ మొదలైంది. కాసేపటికి ఆ నిర్మాత విష్ణు ఇందూరి అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ‘నేను డైరెక్టర్‌ రాజ్, ‘చదరంగం’ (వెబ్‌ సిరీస్‌) గురించి మాట్లాడడంలేదు. విష్ణు ఇందూరి గురించి చెబుతున్నాను. 2015 డిసెంబర్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి చర్చించడానికి విష్ణు ఇందూరి, నేను కలిశాం’ అని దేవా ట్వీట్‌ చేశారు. 
(చదవండి : అడ్డంగా దొరికిన వర్మ‌, ఆగిన ‘మర్డర్‌’!)

దేవా నాకేం చెప్పలేదు: విష్ణు ఇందూరి
‘‘2015లో ఓ రీమేక్‌ కోసం దేవా కట్టాని కలిశాను. అప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఐడియాని బేసిక్‌ స్క్రీన్‌ప్లేతో తనకు చెప్పాను. ఆ ఐడియా తనకు నచ్చింది. అంతేకానీ ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి తను నాకేం చెప్పలేదు’’ అని విష్ణు ఇందూరి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు