వరల్డ్‌ రికార్డ్‌.. 81నిమిషాల పాటు సింగిల్‌ షాట్‌లో మూవీ షూటింగ్‌

28 Oct, 2022 10:05 IST|Sakshi

తమిళసినిమా: దర్శకుడు కే.భాగ్యరాజ్‌ చాలా గ్యాప్‌ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం 3.6.9. పీజీఎస్‌ ప్రొడక్షన్స్‌ అధినేత పీజీఎస్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఫ్రైడే ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీ అధినేత కెప్టెన్‌ ఎంపీ ఆనంద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. శివ మాధవ్‌ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో చిత్ర నిర్మాత పీజీఎస్‌ ప్రతినాయకుడిగా నటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఇందులో బ్లాక్‌ పాండి అజయ్, కన్నన్‌ శక్తి మహేంద్ర తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దీనికి మారీశ్వస్‌ చాయాగ్రహణం, కార్తీక హర్ష సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచస్థాయిలోనే 81 నిమిషాలలో ఏకధాటిగా సింగిల్‌ షాట్‌లో రూపొందించడం విశేషం.

ఇందుకు 24 కెమెరాలను ఉపయోగించారు. 150 మంది నటీనటులు, 450 మంది సాంకేతిక వర్గం పని చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ను నాలెడ్డ్‌ ఇంజినీరింగ్‌ అనే సంస్థ రూపొందించింది. షరీపా అనే టెక్నాలజీ ద్వారా అమెరికాకు చెందిన వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ అనే సంస్థ పర్యవేక్షించి, వరల్డ్‌ రికార్డు బిరుదును ప్రదానం చేసిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శక, నటుడు పాండియరాజన్, సుబ్రమణియం శివ, సంగీత దర్శకుడు దిన తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కె.భాగ్యరాజ్‌ మాట్లాడుతూ తనను పిడివాదం కలిగిన వ్యక్తిగా ఇక్కడ పేర్కొన్నారని, అయితే అది నిజమేనా అని అన్నారు. మంచి విషయాల కోసం తాను ఎప్పుడు పిడివాదంగానే ఉంటానన్నారు. తాను కథను రాసిన ఒరు ఖైదియిన్‌ డైరీ చిత్రాన్ని తన గురువు భారతీరాజా తెరకెక్కించారని, అయితే ఆ చిత్ర క్లైమాక్స్‌ ఆయనకు నచ్చకపోవడంతో మార్చారని చెప్పారు.

కాగా అదే చిత్రం హిందీ రీమేక్‌ను అమితాబ్‌బచ్చన్‌ హీరోగా తాను దర్శకత్వం వహించానని అందులో తాను అనుకున్న క్లైమాక్స్‌లోనే తెరకెక్కించానని అందుకు అంతా అంగీకరించారని తెలిపారు. ఆ చిత్రం కూడా విజయం సాధించిందని చెప్పారు. అలా తనకు నచ్చిన విషయాల కోసం తాను పిడివాదంగానే ఉంటానని అన్నారు. కాగా 3.6.9 చిత్ర కథలు దర్శకుడు చెప్పగానే కొత్తగా ఉండడంతో నటించడానికి సమ్మతించినట్లు కే.భాగ్యరాజ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు