దూత ఓ కొత్త అనుభూతి

30 Nov, 2023 02:43 IST|Sakshi

‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్‌ సిరీస్‌ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్‌ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్‌ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌ అన్నారు.

హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దూత’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ సిరీస్‌ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్‌ కె. కుమార్‌ చెప్పిన విశేషాలు.

► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ సాగర్‌ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్‌ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. 

►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్‌ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది.

►షార్ట్‌ ఫిలిం, వెబ్‌ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం.

మరిన్ని వార్తలు