9 సార్లు కీమోథెరపీ..అంతలోనే మరో రొమ్ముకి కూడా కేన్సర్‌: హంసా నందిని

8 Mar, 2023 00:13 IST|Sakshi

హంసా నందిని

‘‘కేన్సర్‌ అని నిర్ధారణ అయ్యాక గతం తాలూకు భయాలు, అయోమయాలు, ఒత్తిడి... అన్నీ మళ్లీ నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. పలుమార్లు వైద్య పరీక్షలు, పలు స్కానింగ్స్‌ చేయించుకుని, శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఇక ఏ భయం లేదు అనుకుంటున్న సమయంలో మరో రొమ్ముకి కూడా కేన్సర్‌ సోకే ప్రమాదం ఉందని నిర్ధారణ అయింది. మళ్లీ పోరాటం ఆరంభం’’ అని హంసా నందిని చెప్పా రు. 2020లో ఆమెకు గ్రేడ్‌ 3 ‘కార్సినోమా’ (రొమ్ము కేన్సర్‌) నిర్ధారణ అయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసా నందిని ఆ సంగతులు పంచుకున్నారు.

‘‘18 ఏళ్ల క్రితం మా అమ్మగారికి బ్రెస్ట్‌ కేన్సర్‌ అని నిర్ధారణ అయింది. దురదృష్టం కొద్దీ ఆ పో రాటంలో ఆమె ఓడిపోయారు. ఇక నాకు కేన్సర్‌ నిర్ధారణ అయ్యాక 9 సార్లు కీమోథెరపీ జరిగింది.  ఈ క్లిష్ట పరిస్థితి ముగిసిందనుకున్నాను. కానీ ఆ ఆనందం కొన్నాళ్లే. ఎందుకంటే ‘బీఆర్‌సీఏ1’ (వంశపారంపర్య రొమ్ము కేన్సర్‌) అని, జీవితంలో మరో రొమ్ముకి కూడా 70 శాతం కేన్సర్‌ సోకే ప్రమాదం ఉందని తేలింది. దాంతో పలు శస్త్ర చికిత్సలు, మరో ఏడు సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది.

నిజానికి ఇది ఎంతో సవాల్‌తో కూడుకున్నది. అందుకే ‘చిరునవ్వుతో పోరాడాలి. మళ్లీ స్క్రీన్‌ మీద (నటించాలి) కనబడాలి. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా మన జీవితం గురించి చెప్పా లి’ అని నాకు నేనుగా వాగ్దానం చేసుకున్నాను. నేను జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ముందుగా రోగ నిర్ధారణ కావడం, మంచి డాక్టర్లు, నా ఫ్యామిలీ,  నా పాజిటివ్‌ మైండ్‌ కారణం. గత నవంబర్‌లో షూటింగ్‌ సెట్లోకి కూడా అడుగుపెట్టాను.

ఎప్పటికప్పుడు అందరూ రెగ్యులర్‌ చెకప్స్‌ చేయించుకోండి. నేను సజీవంగా ఉన్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు నాకు నేనుగా ఓప్రామిస్‌ చేసుకున్నాను. ‘ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుని బతకాలన్నది’ ఆప్రామిస్‌. ఈ సందర్భంగా మా అమ్మగారి పేరు మీద ‘యామినీ కేన్సర్‌  ఫౌండేషన్‌’ని ఆరంభించాలనుకుంటున్న విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నాను.

మరిన్ని వార్తలు