Prashanth Varma: 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు': ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్!

15 Jan, 2024 09:30 IST|Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన సినిమాను తీశారంటూ పలువురు సినీ ప్రమఖులు ప్రశంసలు కురిపించారు. 

అయితే తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో మా టీమ్ పట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగిన భోగి వేడుకల్లో వాటిలో మంటల్లో విసిరివేయడం మరిచిపోయా అంటూ.. అలాంటి వారిని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ చురలకంటించారు. 

ప్రశాంత్ వర్మ తన ట్వీట్‌లో రాస్తూ.. 'కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో మాపై విపరీతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో మా టీంను ట్రోల్ చేశారు. ఇంకా అలాంటి చెత్తను నిన్న భోగి మంటల్లో వేయడం మరిచిపోయా. ఏది ఏమైనా 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు' అనే విషయం మరోసారి రుజువైంది. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ' అంటూ పోస్ట్ చేశారు. 

అయితే హనుమాన్ రిలీజ్‌కు ముందే పెద్దఎత్తున వివాదం నడిచింది. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. పొంగల్‌ పోటీ తీవ్రం కావడంతో రవితేజ మూవీ ఈ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బహుశా సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన వివాదాన్ని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 12 భాషల్లో విడుదల హనుమాన్‌ చిత్రాన్ని రిలీజ్ చేశారు. 

>
మరిన్ని వార్తలు