సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!

1 Jun, 2021 00:41 IST|Sakshi

‘‘కోవిడ్‌ బాధితుల అవసరార్థం ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమెడెసివిర్‌ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో రిక్వెస్ట్‌లు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్‌ అన్నారు. నిఖిల్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు.

నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే  ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్‌ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్‌ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్‌కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్‌ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్‌’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్‌’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు