తెలుగు లేడీ కిశోర్‌ కుమార్‌

19 Jan, 2021 00:00 IST|Sakshi

ఇండియన్‌ ఐడెల్‌ టాప్‌ 13కు చేరుకున్న తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ తాజా ‘ఆర్‌.డి.బర్మన్‌ – కిశోర్‌ కుమార్‌’ ఎపిసోడ్‌లో ‘దమ్‌ మారో దమ్‌’ పాట పాడింది. దాంతోపాటు కిశోర్‌ కుమార్‌ తన పాటల్లో చేసే యోడలింగ్‌ కూడా చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ షణ్ముఖప్రియ టాలెంట్‌ను చూసి అవాక్కయ్యాడు. ఆమెకు తన తండ్రి ఇష్టంగా తినే రబ్డీని స్వహస్తాలతో తినిపించాడు. విశేషాలు...
 
ఇండియన్‌ ఐడల్‌ అంటే భారతీయ యువ సింగర్‌లకు అతి పెద్ద ప్లాట్‌ఫామ్‌. ఆ రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే పెద్ద కష్టం. అలాంటిది టాప్‌ లిస్ట్‌లో నిలవడం ఇంకా కష్టం. ఆ కష్టాన్ని సాధ్యం చేశారు మన వైజాగ్‌కు చెందిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల. ప్రస్తుతం వీరు టాప్‌ 13కు చేరుకున్నారు. టాప్‌ 10 చేరుకుంటారన్న ఆశను కూడా కలిగిస్తున్నారు. కాగా శనివారం (జనవరి16) జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ ప్రియ విశేషంగా అందరినీ ఆకర్షించింది. దానికి కారణం ఆ ఎపిసోడ్‌ను కిశోర్‌ కుమార్‌ – ఆర్‌.డి.బర్మన్‌ పాటలతో తీర్చిదిద్దారు.


కిశోర్‌ కుమార్, అమిత్‌ కుమార్‌

ఈ ఎపిసోడ్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా కిశోర్‌ కుమార్‌ కుమారుడు అమిత్‌ కుమార్‌ హాజరయ్యారు. ఆయన ముందు షణ్ముఖ ప్రియ ఆర్‌.డి.బర్మన్‌ కంపోజ్‌ చేసిన ‘దమ్‌ మారో దమ్‌’ పాడింది. ఆ తర్వాత కిశోర్‌ కుమార్‌ చేసే యోడలింగ్‌ ప్రదర్శించింది. ‘యోడలే.. యోడలే... యోడలే’ అని పాడేదే యోడలింగ్‌. అందులో షణ్ముఖ ప్రియ దాదాపు ఐదు నిమిషాల సేపు యోడలింగ్‌ చేసి అమిత్‌ కుమార్‌ను అవాక్కు చేసింది. ఆయన షణ్ముఖ ప్రియను మెచ్చుకున్నారు. ‘మా నాన్నకు రబ్డి తినడం అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు నాలుగు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా రబ్డీ తీసి తినేశారు. ముంబైలోని ఒక షాప్‌ నుంచి ఆ రబ్డీని కొనేవారు. ఇవాళ అదే షాప్‌ నుంచి నేను తీసుకొచ్చిన రబ్డీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం నీకు తప్పక అందుతుంది’ అని షణ్ముఖ ప్రియకు రబ్డీ తినిపించారు అమిత్‌ కుమార్‌.

ఈ సందర్భంగా ఆయన కిశోర్‌ కుమార్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు. ‘నాన్న తన గొంతు కోసం అప్పుడప్పుడు ఎండిన తమలపాకులు తినేవారు. గొంతు డ్రైగా ఉంటే బాగా పాడొచ్చు అనుకునేవారు. పాట పాడాక చవన్‌ప్రాశ్‌ పుచ్చుకుని ఎంత తొందరగా రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి బయటపడదామా అని చూసేవారు’ అన్నారు అమిత్‌ కుమార్‌. ఇక్కడ చవన్‌ ప్రాశ్‌ అంటే డబ్బులు.

ప్రస్తుతం ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 12లోని టాప్‌ 13 కంటెస్టెంట్స్‌లో ఆరు మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం గొప్ప విషయం. మిగిలిన నలుగురు అంజలి గైక్వాడ్‌ (మహరాష్ట్ర), అరుణిత (పశ్చిమ బెంగాల్‌), శైలి కాంబ్లె (మహారాష్ట్ర), అనుష్క బెనర్జీ (చండీగఢ్‌).
శిరీష భాగవతుల ఈ పోటీలో చిత్ర పాటలను పాడి ఆకట్టుకుంటూ ఉండగా షణ్ముఖప్రియ ఎనర్జీ నిండిన గీతాలతో ప్రతిభ చూపుతోంది. వీరిలో ఒకరైనా టాప్‌ 5కు చేరుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ షో చూస్తున్న భారతీయులలో వైజాగ్‌ పేరు రెపరెపలాడినట్టే. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు