దర్శకుడిగా నా బలం అదే 

3 Dec, 2023 01:41 IST|Sakshi

‘‘ఓ దర్శకుడిగా యాక్షన్‌ చిత్రాల కథలు కూడా రాయగలను. కానీ ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలైతే కొత్త దర్శకులకు అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ‘హాయ్‌ నాన్న’ కథ రాశాను. నాకు నానీగారు చాన్స్‌ ఇచ్చారు. నాలానే మిగతా దర్శకులకూ ప్రేమకథలు, కుటుంబ కథలతోనే అవకాశాలు వస్తాయని చెప్పలేను. నా విషయంలో జరిగిందని చెబుతున్నాను.

అయితే ఏ జానర్‌ ఫిల్మ్‌ అయినా ఆ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేది అందులోని భావోద్వేగాలతోనే. భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్‌ చేయడం నా బలం అని నా నమ్మకం’’ అన్నారు శౌర్యువ్‌. నాని, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా బాల నటి కియారా ఖన్నా, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో శౌర్యువ్‌ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్‌. మెడిసిన్‌ పూర్తి చేశాను. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. తండ్రీకూతురి అనుబంధం, వీరికి మృణాల్‌ పాత్రతో ఉన్న సంబంధం.. ఈ అంశాల తాలూకు ఎమోషన్స్‌తో ‘హాయ్‌ నాన్న’ కథనం ఉంటుంది. నానీగారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. కథ రీత్యా ఏడ్చినా అందంగా ఉండాలని మృణాల్‌ను తీసుకున్నాం. శ్రుతీహాసన్‌గారి పాత్ర బాగుంటుంది. బేబీ కియారాకి యాక్టింగ్‌ ప్రతిభ ఉంది. హేషమ్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నేపథ్య సంగీతం ఇంకా బాగుంటుంది. సాను మంచి విజువల్స్‌ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు