కళాసాగర్‌ సుభాన్‌ కన్నుమూత 

23 Jun, 2021 10:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: ళాసాగర్‌ సుభాన్‌(90) అలియాస్‌ భరత్‌ మంగళవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈయన పూర్తి పేరు ఎం.ఎ.సుభాన్‌ అయితే కళాసాగర్‌ సుభాన్‌ గానే పాపులర్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సుభాన్‌  చెన్నైలో స్థిరపడ్డారు. స్థానిక విల్లివాక్కంలోని ఐసీఎఫ్‌లో స్టోర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఆ తరువాత పదోన్నతి పొందిన ఈయన తెలుగు భాషాభిమాని. దీంతో ఐసీఎఫ్‌ తెలుగు అసోసియేషన్‌ నెలకొల్పి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి వంటి వారు మీ సేవలు ఐసీఎఫ్‌కే పరిమితం కారాదని, సినీ కళామతల్లికి చాలా అవసరమని ప్రోత్సహించడంతో కళాసాగర్‌ సంస్క్కృతిక సంస్థ 1972లో ఆవిర్భవించింది.

అలా ఆ సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టిన సుభాన్‌ 25 ఏళ్ల పాటు కళామతల్లికి, తెలుగు భాషకు అవిరామంగా విస్తృత సేవలను అందించారు. ఈ కళా సంస్థకు డాక్టర్‌ సీఎంకేరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినీ కళాకారుల ప్రతిభకు ఇచ్చే నంది అవార్డుల కంటే ముందే కళాసాగర్‌ అవార్డులు ఇచ్చేవారు. కళామాతల్లికి, తెలుగు భాషకు విశేష సేవలందించిన సుభాన్‌ మంగళవారం ఉదయం స్థానిక విల్లివాక్కంలోని స్వగృహంలో కన్నుమూశారు. సుభాన్‌ సతీమణి మూడేళ్ల క్రితమే కన్నుమూశారు. వీరికి కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సుభాన్‌ భౌతికకాయానికి మంగళవారం విల్లివాక్కం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కళాసాగర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సీఎంకె రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు