రవితేజ సూపర్‌హిట్‌ మూవీ సీక్వెల్.. హీరోయిన్‌గా ఆమె కష్టమే!

29 Nov, 2023 08:49 IST|Sakshi

నటుడు జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఎం.కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్‌గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. తెలుగులో 2003లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

తాజాగా ఎం.కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్‌రాజా సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంది. 

కాగా ప్రస్తుతం మోహన్‌ రాజా, జయం రవి హీరోగా తనీ ఒరువన్‌ చిత్రానికి సీక్వెల్‌ 'తని ఒరువన్- 2' తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఎం.కుమరన్‌ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. కాగా మోహన్‌రాజా తమిళంలో చిత్రం చేసి చాలా గ్యాప్ వచ్చింది.

'ఎమ్ కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి' తెలుగు సినిమా 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి రీమేక్ అయినప్పటికీ.. తమిళ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిర ఆడై మూర్తి ముఖ్య పాత్రలు పోషించారు. 
 

మరిన్ని వార్తలు