త్రిషకు క్షమాపణ చెప్పను.. నేను మాట్లాడితే అగ్నిగోళం బద్దలవుతుంది: మన్సూర్‌

22 Nov, 2023 09:06 IST|Sakshi

నటి త్రిష గురించి నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ఇటీవల చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం పేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇటీవల విజయ్‌ హీరోగా నటించిన లియో చిత్రంలో నటించారు. దీంతో ఆ చిత్రంలో త్రిష నటిస్తున్న విషయం తెలిసి ఆమెతో తనకు బెడ్‌ రూం సన్నివేశాలు ఉంటాయని భావించానని, అయితే అ లాంటివి లేకపోవడం నిరాశ పరిచిందనని మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఈ రచ్చకు కారణం.

ఆయన వ్యాఖ్యలను త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఈ వ్యవహారంపై మన్సూర్‌ అలీ ఖాన్‌కు నోటీసు జారీ చేసింది. అందులో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని సంఘం సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించ కూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై మన్సూర్‌ అలీ ఖాన్‌ మంగళవారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొంటూ తాను త్రిష గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాన కొందరు కావాలనే వక్రీకరించారని పేర్కొన్నారు. తాను త్రిషకు క్షమాపణ చెప్పే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తాను మరీ అంత తీసేసిన వాడినా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విధంగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా విషయం తెలుసుకోకుండా మాట్లాడారని, ఆయన చిత్రాల్లో నటించనని, అయితే గియితే హీరోగా మాత్రమే నటిస్తానన్నారు. ఇక దక్షిణ భారత నటీనటుల సంఘం తనకు ఈ వ్యవహారంలో నోటీసులు పంపి పెద్ద పొరపాటు చేసిందన్నారు. అందులో పేర్కొన్న విధంగా నటి త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తాను మాట్లాడితే అగ్నిగోళం బద్ధలవుతుందన్నారు. తనకు జారీ చేసిన నోటీసును నటీనటుల సంఘం ముందు వాపస్‌ తీసుకోవాలని, ఆ తరువాత పిలిపిస్తే వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని ప్రకటించారు. కాగా త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మన్సూర్‌ అలీఖాన్‌పై నుంగంబాకం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు