అక్కడ కూడా పొన్నియిన్‌ సెల్వన్‌ కథ చదివేవారి సంఖ్య పెరుగుతోంది: కార్తీ

1 Oct, 2022 09:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: మణిరత్నం తెరకెక్కించిన చారిత్రక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్‌ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీ పన్, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. మెడ్రాస్‌ టాకీస్, లెకా సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడం విశేషం. కాగా తొలి భాగం శుక్రవారం తెరపైకి వచ్చింది. ముందెప్పుడూ లేనట్లుగా మణిరత్నం టీమ్‌ ఈ చిత్ర ప్రచారంలో పాల్గొనడం విశేషం.

పలు రాష్ట్రాలు చుట్టొచ్చిన నటుడు కార్తీ మీడియాతో ముచ్చటిస్తూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర ప్రచారానికి ఇతర రాష్ట్రాల్లోనూ విశేష ఆదరణ లభించిందన్నారు. రైలు ప్రయాణంలో కూడా పొన్నియిన్‌ సెల్వన్‌ నవల చదివేవారి సంఖ్య అధికం అవుతోందన్నారు. కొంతమంది యూట్యూబ్‌లో వింటున్నారని చెప్పారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర నిర్మాణం మొదలైన తరువాత ఈ కథ తెలుసుకోవాలనే ఆసక్తి ఇతర రాష్ట్రాల ప్రజల్లోనూ పెరుగుతోందని అన్నారు. ఆ కాలంలో రాజులు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు? అప్పటి మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉండేవి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోందన్నారు.

ఇలాంటి చిత్రాన్ని చేయడం మణిరత్నంకే సాధ్యం అయ్యిందన్నారు. ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్‌ ఇలా ఏ తరహా చిత్రానికైనా ఆయన విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయన్నారు. చిత్రంలో జయం రవి, త్రిష, ఐశ్యర్యరాయ్‌ వంటి నటీనటులతో కలిసి నటించడం తనకు మంచి అనుభవం అన్నారు. కాగా ఈ చిత్రం తరువాత తాను కథానాయకుడిగా నటించిన సర్దార్‌ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నారు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపారు.

    

మరిన్ని వార్తలు