KGF 2 Toofan Singer: ఆయనకు నా సెల్యూట్‌, అలాంటి వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు

18 Apr, 2022 15:37 IST|Sakshi

కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 బాక్సాఫీస్‌ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే! కానీ ఈసారి అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తామంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కేజీఎఫ్‌ 2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకింగ్‌ స్టార్‌ యశ్‌ తన నటనతో రఫ్ఫాడించాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. ఈ మూవీకి సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా తుఫాన్‌ సాంగ్‌కు అయితే ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ సాంగ్‌ను హిందీలో బ్రిజేష్‌ శాండిల్య ఆలపించాడు. తాజాగా అతడు ‘సాక్షి’ ప్రతినిధి రేష్మి ఏఆర్‌తో  ముచ్చటించాడు. ఆ విశేషాలేంటో చదివేయండి..

కేజీఎఫ్‌ 2లో మీరు పాడిన తుఫాన్‌ సాంగ్‌ సంచలనం సృష్టిస్తోంది, ఎలా ఫీలవుతున్నారు.
ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి నాతో పాటు కేజీఎఫ్‌ టీమ్‌ కూడా చాలా సంతోషంగా ఉంది. వెండితెర మీద ఈ సాంగ్‌ వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తారో నేను ఊహించగలను.

ఇది ఇంతకుముందు మీరు పాడిన పాటలకు భిన్నంగా ఉంది కదూ!
తుఫాన్‌ ఫుల్‌ ఎనర్జీతో సాగే పాట. దీన్ని పాడటం అంత ఈజీయేం కాదు. నిజానికి శక్తిమంతంగా ఉండే పాటలను పాడటం అంటే నాకిష్టం. కానీ తుఫాన్‌ ఊహించినదానికంటే ఎక్కువ ఎనర్జీతో సాగుతుంది. ఈ పాట పాడటం పూర్తి చేశాక రెండు రోజులవరకు నేను నా గొంతుకు విశ్రాంతినిచ్చాను.

పాట పాడటానికి ముందు ఎలా ప్రిపేర్‌ అవుతారు?
అది పాడే పాట మీద ఆధారపడి ఉంటుంది. హై పిచ్‌లో పాడే పాటకు ముందునుంచి కొంత ప్రాక్టీస్‌ చేయాల్సిందే, తప్పదు!

కేజీఎఫ్‌ 2లో పాడే అవకాశం ఎలా వచ్చింది?
తుఫాన్‌ పాట రాసిన షబ్బీర్‌ అహ్మద్‌ నాకు మంచి స్నేహితుడు. అతడు నా పేరు సూచించడంతో సాంగ్‌ కంపోజ్‌ చేసిన రవి బర్సూర్‌ ఓసారి నా గొంతును టెస్ట్‌ చేశాడు. నచ్చడంతో ఫైనల్‌ చేశాడు. ఇందుకు షబ్బీర్‌కు నిజంగా థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. నేను అనుకున్నదానికంటే ఎక్కువ హిట్‌ అయ్యిందా సాంగ్‌.

రవి బర్సూర్‌తో కలిసి పని చేసినందుకు ఎలా ఫీలవుతున్నారు?
ఆయన చాలా సింపుల్‌గా ఉంటూనే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇలాంటి వ్యక్తిని నేనింతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఊర్లో స్టూడియో పెట్టుకుని అక్కడే పని చేస్తున్నాడు. అతడి గ్రామమైన బర్సూర్‌కు వెళ్లడం మాకు ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. అందరి నోళ్లలో కేజీఎఫ్‌ నానుతుందంటే దానికి అతడు కూడా ఓ కారకుడే. ప్యాషన్‌, పట్టుదల ఉంటే ఎక్కడినుంచైనా ఏదైనా చేయవచ్చని ఆయన నిరూపించాడు. అతడికి నా సెల్యూట్‌.

కరోనా వైపరీత్యం కంటే ముందు లైవ్‌ కన్సర్ట్స్‌ జరిగేవి. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో లైవ్‌లో పాడుతున్నారు. కన్సర్ట్‌ పెడితే మునుపటిలా జనాలు వస్తారంటారా?
జనాల మధ్యలో మైక్‌ పట్టుకుని పాడితే ఆ మజానే వేరు. లైటింగ్‌, బ్యాండ్‌, స్టేజీ మీద మైక్‌ పట్టుకుని వారి ఎదురుగా పాడితే ఆ పాట నేరుగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అదే ఆన్‌లైన్‌లో పాడితే కంప్యూటర్స్‌, సెల్‌ఫోన్స్‌లో చూస్తారు. పెద్దగా థ్రిల్‌ ఉండదు. జనాలు కూడా లైవ్‌ కన్సర్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

పాన్‌ ఇండియా సినిమాల వల్ల సంగీత కళాకారులకు ఏదైనా లాభం ఉందా?
ఒక భాషలోని పాటలు మరో భాషలోని వారికి కొన్నిసార్లు నచ్చుతాయి, మరికొన్నిసార్లు నచ్చవు. ఉదాహరణకు బుట్టబొమ్మ పాటకు అర్థం తెలియకపోయినా ఆ బీట్‌ను చాలామంది ఎంజాయ్‌ చేస్తారు. అలా పాన్‌ ఇండియా సినిమాల వల్ల సంగీతకారులకు పని దొరుకుతుంది.

సింగర్ల రెమ్యునరేషన్‌ సంగతేంటి?
వారి పనికి తగ్గ పారితోషికం ఇవ్వడం లేదని నా అభిప్రాయం.

మీ ఆల్బమ్స్‌ గురించి చెప్తారా?
ఇప్పటివరకు నేను హిందీలో 70 పాటలు పాడాను. అందులో చాలావరకు హిట్టయ్యాయి. త్వరలో నా ఆల్బమ్‌ నుంచి మరో కొత్త పాట రిలీజ్‌ కాబోతోంది. 

తెలుగులో ఏదైనా సాంగ్‌ పాడుతున్నారా?
ఈమధ్యే తెలుగులో ఓ పాట పాడాను. దానికి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. గతంలో అతడితో సరైనోడు సినిమాకు కూడా వర్క్‌ చేశాను. గోల్‌మాల్‌ టైటిల్‌ ట్రాక్‌ కూడా పాడాను.

తెలుగు పాటలంటే ఇష్టమా?
ఏ భాషలో అయినా సరే పాడటం అంటే మహా ఇష్టం. తెలుగు పాటను ఒక అరగంటలో పాడేస్తాను. భాష తెలియపోయినా సరే తెలుగు, తమిళ్‌ సాంగ్స్‌ను అప్పుడప్పుడూ అలా పాడుతూ ఉండేవాడిని. అలాంటిది నేను తెలుగులో ఓ పాట పాడతానని ఎప్పుడూ అనుకోలేదు.

ఫేవరెట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు?
తనీష్‌ బగ్చి. అలాగే ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం బాగా నచ్చుతుంది.

సౌత్‌లో బెస్ట్‌ సింగర్‌?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్‌.

సింగర్‌ కావాలన్నది మీ డ్రీమా?
గాయకుడిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. రైతు కుటుంబంలో పుట్టిన నేను వ్యవసాయమే చేస్తాననుకున్నాను. ఇప్పటికీ మేము పొలం పండిస్తాము. ఇదంతా పక్కనపెడితే నేను మంచి సింగర్‌ను అవుతానని నా ఫ్రెండ్‌ చెప్పాడు. అప్పుడే దీనిమీద ఫోకస్‌ చేశా. అలహాబాద్‌లోని ప్రయాగ్‌ సంగీత్‌ సమితిలో సంగీతం నేర్చుకున్నా. అలా మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది.

చదవండి: వీకెండ్‌లో మోత మోగించిన కేజీఎఫ్‌ 2, కలెక్షన్లే కలెక్షన్లు!

మరిన్ని వార్తలు