KGF Director: ప్రశాంత్‌ నీల్‌.. మన బంగారమే

26 Apr, 2022 08:23 IST|Sakshi

కేజీఎఫ్‌.. కేజీఎఫ్‌.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్‌ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్‌ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్‌ నీల్‌ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో    సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్‌నీల్‌ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం.  

మడకశిర(అనంతపురం): ప్రశాంత్‌ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్‌ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్‌ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్‌–2 రిలీజ్‌ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. 

వెండితెర ప్రయాణమిలా.. 
ప్రశాంత్‌ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్‌ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్‌ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌ సినిమాలపై మక్కువతో ఫిల్మ్‌ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు.  

ఉగ్రమ్‌తో విశ్వరూపం 
2014లో ‘ఉగ్రమ్‌’ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా  అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ‘ఉగ్రమ్‌’ సినీ చిత్రీకరణకు కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్‌ నీల్‌.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్‌ రాసుకుని కోలార్‌ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్‌–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్‌–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్‌–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది.  

నీల్‌ అంటే నీలకంఠాపురం.. 
రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్‌ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్‌ కుమారుడు ప్రశాంత్‌నీల్‌ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్‌ తన ఇంటిపేరును నీల్‌ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్‌ హీరోగా మరో భారీ బడ్జెట్‌ చిత్రం ‘సలార్‌’ను ఆయన తెరకెక్కించనున్నారు.   


నీలకంఠాపురంలోని ప్రశాంత్‌నీల్‌ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు

ఆనందంగా ఉంది 
మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా.      
– భారతి, ప్రశాంత్‌నీల్‌ తల్లి 

నీలకంఠాపురానికి గుర్తింపు 
సినిమా డైరెక్టర్‌గా ప్రశాంత్‌నీల్‌ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. 
– చిన్న రంగేగౌడ్, ప్రశాంత్‌నీల్‌ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం

చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?

మరిన్ని వార్తలు