ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం | Sakshi
Sakshi News home page

ఓయూ@105

Published Tue, Apr 26 2022 8:21 AM

OU Is 7th University In The Country First Time Host Foundation Day - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1917 ఏప్రిల్‌ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్‌ (రాజాజ్ఞ) జారీ చేశారు. అడిక్‌మెట్‌ జాగీర్‌లో నిజాం 2వ నవాబు నుంచి  మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఓయూలో మంగళవారం ఫౌండేషన్‌ డే నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటిమందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తొలి రోజుల్లో ధనవంతుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించగా నేడు ఓయూ నూరుశాతం మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. 

ఏటా నిర్వహిస్తాం.. 
దేశంలోనే 7వ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచిన ఓయూ తొలిసారి ఫౌండేషన్‌ డేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఇకపై ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. తొలిసారి జరుగుతున్న 105వ ఫౌండేషన్‌ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు ఇక్కడే మొదలయ్యాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వందలాది మంది నాయకులను తయరు చేసిన ఘనత ఓయూకు దక్కుతుంది. 
– వీసీ ప్రొ.రవీందర్‌ 

ఆర్ట్స్‌ కాలేజీ భవనం నిర్మాణం చరిత్రాత్మకం 
ఓయూ ఐకాన్‌గా నిలిచిన ఆర్ట్స్‌ కాలేజీ భవన నిర్మాణం చరిత్రాత్మకం. ఓయూ స్థాపనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో నిజాం నవాబ్‌ 1934లో ప్రారంభించిన ఆర్ట్స్‌ కాలేజీ భవన నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఓయూలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ వరకు దూరవిద్య, రెగ్యులర్‌ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు.   
– ప్రొ.అంజయ్య– చరిత్ర విభాగం  

70 శాతం మహిళలు చదవడం ఓయూ ప్రత్యేకత 
ఓయూలో తొలిరోజుల్లో ధనవంతుల పిల్లలు చదువుకునేవారు. నేడు నూటి కి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందులో 70శాతం మహిళలు ఉండటం విశేషం. 105 ఏళ్ల చరిత్ర గల ఓయూకు  పూర్వ వైభవం తెచ్చేందుకు వీసీ చేస్తున్న కృషి అభినందనీయం. 
– ప్రొ.సూర్య ధనుంజయ్‌– తెలుగుశాఖ. 

ఆనందంగా ఉంది 
అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, ఇతరులను అందించిన ఓయూలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓయూ నేడు 105 ఫౌడేషన్‌ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది.  
–సంజయ్‌–పీహెచ్‌డీ విద్యార్థి.  

ఓయూ ఫౌండేషన్‌ డే పై నేడు లెక్చర్‌ 
ఓయూ 105వ ఫౌండేషన్‌ డే సందర్భంగా లోక్‌పాల్‌ సెక్రెటరీ భరత్‌లాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మంగళవారం లెక్చర్‌ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొ.రవీందర్‌ తెలిపారు. సోమవారం ఫౌండేషన్‌ డేను విజయవంతం చేయాలని కోరుతూ వాక్‌ అండ్‌ రన్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఓయూ ఇంజినీరింగ్‌ ఎదుట వీసీ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10.30 నిమిషాలకు జరిగే ఫౌండేషన్‌ డే కార్యక్రమానికి విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

(చదవండి: సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపులు)

Advertisement
Advertisement