తేడా ఎక్కడ లేదు?

3 Dec, 2020 06:08 IST|Sakshi

‘‘జీవితంలో ఏది జరిగినా అది మంచికే అని నమ్మే వ్యక్తిని నేను. కొన్ని తలుపులు మూసుకుపోతే కొన్ని తెరుచుకుంటాయి అని కూడా నమ్ముతాను. జీవితంపట్ల నా ఆలోచనలు అంత సానుకూలంగా ఉంటాయి’’ అంటున్నారు కృతీ సనన్‌. చిత్రపరిశ్రమలో ‘పెద్దింటి పేరు’ లేదా ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్‌’ ఉన్నవారికి ఉండే ప్రాధాన్యం గురించి కృతీ మాట్లాడుతూ – ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అది సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా ఉంటుంది.

మా అమ్మ ప్రొఫెసర్‌. ఆవిడ కాలేజీలోనూ ఈ వ్యత్యాసం ఉంది. మా నాన్న ఓ ఆఫీస్‌లో ఉదోగ్యం చేసేవారు. అక్కడా తేడా కనిపించేది. సో.. మన చుట్టూ ఇది ఉంది. అందుకే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఎవరి ప్రయాణం వారికి ఉంటుంది. ఆ ప్రయాణం వేరేవాళ్లకన్నా భిన్నం అనేది అర్థం చేసుకోవాలి. అయితే అన్ని విషయాల్లోనూ మన ఆలోచనలు ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ మనుషులమే కదా.. అప్పుడప్పుడూ మనం కూడా నిరుత్సాహపడతాం.

ఉదాహరణకు నాకు దక్కాల్సినది వేరే వ్యక్తికి దక్కినప్పుడు, అది పొందిన వ్యక్తి కంటే నేను అర్హురాలిని అనిపించినప్పుడు చాలా బాధపడతాను. అలాగే పారితోషికంపరంగా పరిశ్రమలో ఉన్న తేడా కూడా నన్ను బాగా బాధపెడుతుంటుంది. కానీ బాధ వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. శక్తి మొత్తాన్ని చేసే పని మీద పెడితే ఎదుగుదల ఉంటుందని, ప్రశాంతంగా ఉండగలుగుతామని అనుకుంటాను. అందుకే ఫోకస్‌ మొత్తం పని మీద పెడతాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు