వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

21 Nov, 2023 01:18 IST|Sakshi
విద్యార్థినులతో బస్సులో వెళ్తున్న ఐటీడీఏ పీవో

రంపచోడవరం: ప్రభుత్వ గురుకులాలు, గిరిజన ఆశ్రమాలు, కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థులకు వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే హెచ్చరించారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, తరగతి గదిలో లైట్లు, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు సోమవారం ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పీవో వారితో కలిసి ప్రైవేట్‌ బస్సులో అక్కడి నుంచి గురుకుల బాలికల పాఠశాలకు వెళ్లారు. విద్యార్థినులకు తాగునీరందించే ఆర్వో ప్లాంట్‌, వాటర్‌ ట్యాంక్‌ను ఆయన పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనలో లోపాలను గుర్తించిన ఆయన ప్రిన్సిపాల్‌ను బాధ్యతలనుంచి తప్పించి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు అప్పగించారు. వెంటనే మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారవర్గాలను పీవో ఆదేశించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సీడీపీవో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే హెచ్చరిక

విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందన

గురుకులానికి బాలికలతో కలిసి బస్సులో వెళ్లిన పీవో

ప్రిన్సిపాల్‌ను బాధ్యతల నుంచి తొలగింపు

మరిన్ని వార్తలు