Lata Mangeshkar Facts: లతా మంగేష్కర్‌పై గతంలో విష ప్రయోగం, మంచంపైనే సింగర్‌!

6 Feb, 2022 14:06 IST|Sakshi

ఆమె గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం​ ఉంది. దానికి అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించగల సామర్థ్యం ఉంది. ఆ కోకిల స్వరం నుంచి జాలువారిన పాటలు వేలల్లోనే ఉన్నా తెలుగులో మాత్రం మూడంటే మూడు పాటలే పాడింది. ఇప్పుడేకంగా ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు.

1963లో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్‌.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్‌దేవ్‌ ఓ పుస్తకంలో వెల్లడించారు.

మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లతా మంగేష్కర్‌ తర్వాత కోలుకున్నారు కానీ ఈ విషప్రయోగంతో చాలా నీరసపడిపోయారని అందులో పేర్కొన్నారు. చాలా రోజుల పాటు ఆమె మంచంపైనే ఉండిపోయారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్‌ పురీ ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్‌ చెప్పి ఆమెను నవ్వించేవారని, ఆమె తినే ప్రతి వంటనూ ముందు ఆయన తిని చెక్‌ చేసేవారట. ఇలా కొన్నాళ్లపాటు ఆమె వెన్నంటే ఉంటూ ఆమె కోలుకునేందుకు సుల్తాన్‌పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు